కావటి మనోహర్ రాజీనామా!
posted on Mar 16, 2025 12:08PM

సొంత పార్టీ నేతలపై నమ్మకం పోయిందా?
అవిశ్వాసంతో,పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే పక్కకు తప్పుకున్నారా!
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా? పోరాడి ఓడిపోవడం కంటే ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి? ఉన్న అధికారాన్ని కాపాడుకో లేకపోయిన వైసిపి కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బకు గుంటూరులో వైసిపి పట్టు పూర్తిగా కోల్పోయినట్లేనా?
గుంటూరు నగరపాలక సంస్థను వైసిపి కోల్పోయింది.. ఆ పార్టీ నాయకుడు, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు. ఈ విషయంలో ప్రత్యర్థి కూటమి పార్టీ పవర్ కంటే ,సొంత పార్టీలోని నాయకుల అసమర్ధతే మేయర్ మనోహర్ తో రాజీనామా చేపించిందన్న చర్చ జరుగుతున్నది. నిజానికి మరి కొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి పని మొదలుపెట్టింది. కానీ టిడిపి చేతిలో దెబ్బతినకుండా, మనోహర్ చేసిన రాజీనామా.. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న దానికి పదానికి ప్రత్యక్ష ఉదాహరణ గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. .ఈ డివిజన్లో గతం లో 2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 46 మంది విజయం సాధించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ నుండి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా పనిచేస్తున్నారు. ఐతే 2024 ఎన్నికల్లో ప్రభంజన విజయాన్ని అందుకున్న కూటమి నాయకులు గుంటూరు మేయర్ స్థానం పై దృష్టి పెట్టారు. మారుతున్న కాలంతో పాటు, కార్పొరేషన్ లో రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది 2024 ఎన్నికలకు ముందే, ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు. ఆరు, ఆరు 12 కదా ,ఈ బారా తో హైరానా ఎందుకనుకున్నారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఒక్కొక్క మార్పు జరిగే కొద్దీ , వైసీపీ నాయకులకు టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవహారం ఓ వైపు పార్టీకి, మరోవైపు మేయర్ స్థానానికి చేటు తెచ్చేలా ఉంది అని తెలుసుకున్నా సరే వైసిపి జిల్లా నాయకులు ఆలస్యంగా నిద్ర మేల్కొన్నారు. ఇక్కడ వైసిపి నాయకులు నిద్ర పోయారు అనడం కంటే ,నిద్ర నటించారు అంటే బాగుంటుందని సొంత పార్టీ కాడరే దుమ్ముత్తిపోసే పరిస్థితికి తీసుకు వచ్చారు వ్యవహారాన్ని. ఈ లోపు కూటమి నాయకులు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసారట.
కూటమి నుంచి విజయం సాధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి గుంటూరులోనే మకాం వేసి, తమ దగ్గర ఉన్న వనరులను వైసీపీ కార్పొరేటర్ కు రుచి చూపించారు. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన మార్పు వ్యవహారం, చివరికి పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు, కూటమి పంచన చేరే వరకూ వెళ్లింది. కౌన్సిల్లో 36 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుంది. అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఆరుగురు సభ్యులు టిడిపికి చెందినవారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. దీంతోనే అర్థం అయిపోయింది మనోహర్ కు గుంటూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో అనేది...... అయితే ఈ వ్యవహారంలో మనోహర్ కు సహకరించాల్సిన సొంత పార్టీ నేతలు ,వెన్నుపోటు పొడిచారట ...స్టాండింగ్ కమిటీలో టిడిపి వాళ్ళు ఎట్టా గెలుస్తారో చూస్తామని, జబ్బలు చరిచిన వాళ్ళు ,చివరి రెండు రోజులు సైలెంట్ అయిపోయి సొంత కార్పొరేటర్ ను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారట.... గుంటూరు నగరంలోనూ జిల్లాలోనూ మా పవర్ ఏంటో చూపిస్తామని ,బీరాలు పలికే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహారం కళ్లారా చూసిన మనోహర్ వీళ్లేనా పార్టీని కాపాడుకునేది అని అప్పట్లోనే అంతర్మథనానికి గురయ్యారట. తన పక్కన ఉండే కార్పొరేటర్లను పక్క పార్టీలోకి పంపించిన నాయకులు కొందరైతే, కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నా, పోతే పోనీ మనకేంటి అని రెచ్చగొట్టిన నాయకులను చూసిన మనోహర్ ఇక కార్పొరేషన్ రాజకీయాల్లో ఉండకూడదని నిశ్చయిం చుకున్నట్లు ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఎలాంటి హడావుడీ లేకుండా మేయర్ పదవికి రాజీనామా చేశారు.
అయితే టిడిపికి చెందిన నాయకులు, మార్చిలో గుంటూరు మేయర్ ను మార్చేస్తామని చెప్పినట్లుగానే, చెప్పిన పని చెప్పినట్లుగా తమ చేతికి మట్టి అంటకుండా చేసేసారు. నిజానికి, మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రాజకీయంగా, న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయని టిడిపి ఆలోచించింది. సొంత పార్టీ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ గుంటూరులో మాత్రం అలాంటిది జరగలేదు. వైసిపి నిట్ట నిలువునా చేతులెత్తేసింది. ఓ పక్కన కూటమికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్,కీలకంగా మారి గుంటూరులో చక్రం తిప్పుతుంటే , ప్రతిఘటించాల్సిన వైసిపి నాయకులు బేర్ మన్నారట. దీంతో పెద్ద స్థాయి నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, ఇక మనకెందుకులే అనుకున్నారు క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు. దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వైసిపి మేయర్ స్థానాన్ని కోల్పోయింది.... గుంటూరులో ఈ వ్యవహారం ,రాబోయే రోజుల్లో వైసిపి లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.