గుంటూరు మేయర్ రాజీనామా.. అవిశ్వాసం భయంతోనేనా?

గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు.   గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 

 వైసీపీ నుంచి కార్పొరేట‌ర్లు కూట‌మిలో చేర‌డంతో వైసీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ నెల 17న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మ‌నోహ‌ర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఆయ‌న‌ రాజీనామా చేశారంటున్నారు.

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ   పదవిలో ఉండాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు అన్నారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైంది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాలలోనూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 17) స్టాండింగ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే జరిగితే అవిశ్వాస తీర్మానం గెలిచి మేయర్ గా కావటి దిగిపోవాల్సి రావడం ఖాయం. దీంతోనే కావటి మేయర్ పదవికి రాజీనామా చేసేశారు.  

నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆ మేయర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్‌గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో కూటమి నేతలు సరిగ్గా ఆయన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన రోజునే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.