శ్రీశైల క్షేత్రంలో బయటపడ్డ భారీ కుంభకోణం

పవిత్ర శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. శ్రీఘ్ర దర్శనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు స్వాహా చేశారు. 150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో కోటి 80 లక్షల రూపాయలను, 1500 రూపాయల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయలను, వసతి సదుపాయం కౌంటర్లో 50 లక్షలను కాజేశారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అవినీతికి పాల్పడ్డ అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే మార్చేశారు.

అవినీతి బండారం బయటపడుతుంటంతో ఈవోకి పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఉద్యోగులు. ఈ అంశంపై శ్రీశైలం ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ.. భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని అన్నారు. మొత్తం అవినీతి ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదన్న ఆయన.. రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేస్తున్నామని ఈవో రామారావు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu