మల్కాజ్‌గిరి పై దేవేందర్‌గౌడ్ కు మైనంపల్లి వార్నింగ్
posted on Mar 12, 2013 12:35PM

మల్కాజ్‌గిరి అసెంబ్లీ టిక్కెట్ వ్యవహారంపై సీనియర్ నేత, ఎంపీ దేవేందర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నీ నిర్వాకం వల్లనే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టి స్వంత పార్టీ పెట్టుకుని దాన్ని ప్రజారాజ్యం పార్టీలో కలిపి పోటీ చేయించావు. నీ కుట్రలకు ఎందరినో బలిచేశావు. నన్ను వ్యక్తిగతంగా నష్టపరచాలని చూశావనుకో ..నీ భాగోతం అంతా బయటపెడతా” అని హెచ్చరించారు.
జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో, మల్కాజ్‌గిరిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారంటూ మైనంపల్లిని దృష్టిలో పెట్టుకొని దేవేందర్‌గౌడ్ విమర్శలు చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు స్థానికులకే కేటాయిస్తామని బయట వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని ఆయన సమావేశంలో అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పొటీ చేయాలని భావిస్తున్న మైనంపల్లికి దేవేందర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు రుచించలేదు. దీంతో దేవేందర్‌గౌడ్ పై మండిపడ్డారు.