మహానాడులో తెరమీదకు బాబు ముఖ్యాంశాలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని దుష్ట శక్తుల నుండి ఆనాడు కాపాడటానికే తాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై తిరుగు బాటు చేయాల్సిన అవసరం వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మహానాడు ముగింపు సమావేశంలో స్పష్టం చేశారు. 30వ మహానాడు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ఆవేదనగా, ఆవేశంగా పలు ముఖ్య అంశాలను తెరమీదకు తీసుకు రావడం విశేషం. ఎన్టీఆర్ తనకు మామ మాత్రమే కాదని, ఆరాధ్య దైవం అన్నారు. ఎన్టీఆర్‌కు ఎదురు తిరుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అయితే కొన్ని దుష్ట శక్తులు పార్టీని నాశనం చేస్తుంటే మామపైనే తిరుగు బాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని లక్ష్మీపార్వతి చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు మహానాడు వేదికగా సమాధానం చెప్పారు. తాను ప్రజాస్వామ్యబద్దంగా 200 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నాయకత్వ మార్పిడి చేయించానని చెప్పుకొచ్చారు. టిడిపి చిరస్థాయిగా రాష్ట్రంలో ఉండి తెలుగు వారికి సేవ చేయాలనేదే తన కోరిక అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై 30 ఏళ్లుగా టిడిపి ఒక్కటే పోరాటం చేస్తుందన్నారు.

అదే వేదికపై బావమరిది హరికృష్ణకు కూడా సమాధానం చెప్పారు. బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు. బంధువులు మాకు అవసరం. అయితే టిడిపి కూడా ఓ పెద్ద కుటుంబం అని చెప్పుకొచ్చారు. కొందరు కార్యకర్తలు అనవసరంగా పోస్టర్లు వేసి వివాదం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు. కన్నెర్ర చేసి ప్రభుత్వాన్ని పడగొడతానని ప్రగల్బాలు పలిగిన జగన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎందుకు పడగొట్టడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తన ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిస్తే రైతు సమస్యలపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తాము సిద్ధమని జగన్‌కు సవాల్ విసిరారు. నిత్యం ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరించే జగన్ ఇప్పటికైనా రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వంపై కన్నెర్ర చేయాలని సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ఎంపీలు దద్దమ్మలని అన్నారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకు రాలేక పోతున్నారని ఆరోపించారు. వెనుక బడిన వర్గాల వారికి రిజర్వేషన్ కోసం జాతీయస్థాయిలో పోరాడటానికి తాము సిద్ధమని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu