విజయోత్సాహంలో హేమ.. మా సస్పెన్షన్ ఎత్తివేత!

సినీ ప్రముఖుల జీవితాలు అంత తేలికగా ఉండవు. ఎన్నో గాసిప్ లు వినిపిస్తుంటాయి. మరెన్నో వివాదాలు చుట్టుముడుతుంటాయి. కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటి హేమ (Hema) కూడా ఒక వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తలను మొదటి నుంచి హేమ ఖండిస్తూ వచ్చారు. ఇవి తప్పుడు ఆరోపణలు అని, తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. అయినప్పటికీ హేమ డ్రగ్స్ తీసుకున్నారనే ప్రచారానికి తెరపడలేదు. ఈ క్రమంలో ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నుంచి సస్పెన్షన్ కి గురయ్యారు. అయితే ఇన్నిరోజులు పోరాట ఫలితంగా ఎట్టకేలకు హేమకి MAA నుండి గుడ్ న్యూస్ అందింది.

డ్రగ్స్ తీసుకోలేదని హేమ తన మాటల ద్వారా చెప్పడమే కాకుండా.. తాను డ్రగ్స్ తీసుకోలేదని ప్రూఫ్స్ తో నిరూపించారు. డ్రగ్స్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిన రిపోర్ట్ ని బయటపెట్టారు. తన మీద కొందరు మీడియా వారు కావాలని బురద చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, ఎలాంటి టెస్ట్ కైనా సిద్ధమని ప్రకటించారు. అపాయింట్మెంట్ దొరికితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తాను నిర్దోషినని నిరూపించుకుంటానని అన్నారు. 

హేమ డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్స్ రావడం, తనకు జరిగిన అన్యాయంపై హేమ గళం వినిపిస్తున్న క్రమంలో.. మా అసోసియేషన్ ఆమెకు తీపి కబురు చెప్పింది. హేమపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా హేమ తన సంతోషం వ్యక్తం చేశారు. "థాంక్యూ మా.. నువ్వు ఎప్పుడూ  నాతో అమ్మ లాగానే దయగా ఉంటావు" అని రాసుకొచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.