ఆప్తుణ్ణి కోల్పోయాను.. మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణంరాజు త‌న‌కు అత్యంత ఆత్మీయులని,  అప్ప‌టి ప్ర‌ధాని వాజ్‌ పేయి  హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన త‌న‌ను ఎంతగానో అభిమానించేవార‌ని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమ‌ని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి పట్ల..మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ .తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. కృష్ణంరాజు మృతి సినీరంగానికి, రాజ కీయ రంగానికి తీరని లోటని అన్నారు. సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడినటువంటి సేవలందిం చారని కొనియాడారు.

తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన..తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‎సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, రాజకీయ పాలన రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యు లకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు  సంతాపం తెలి పారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు  అన్నారు. కేవలం నటునిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకు న్నారు. 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం..తెలుగు వెండితెరకి తీరని లోటని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‎గా ఎదిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి విచారకరమని లోకేష్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్న‌త కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. భ‌క్త క‌న్న‌ప్ప చిత్రం చూస్తున్నంత‌సేపూ, ఆ త‌ర్వాత కొద్ది రోజుల వ‌ర‌కూ కూడా ప్రేక్ష‌కులు, శివ‌భ‌క్తులూ క‌న్న‌ప్పను ద‌ర్శ‌నం చేసుకున్నభాగ్యం అనుభ‌వించారు. వెండితెర మీద క‌న్న‌ప్ప చ‌రిత్ర‌ను క‌ళ్ల ముందు సాక్షాత్క‌రించిన చిత్ర‌రాజం. క‌న్న‌ప్ప‌గా కృష్ణంరాజు న‌టించార‌నే కంటే క‌న్న‌ప్పే కృష్ణంరాజులో ఇమిడాడు అన‌డం స‌బ‌బు. అంత అద్భుతంగా చేశారు కృష్ణం రాజు. అలాగే బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న ఊరి పాండ‌వులు చిత్రంలోనూ అంతే అద్భుతం న‌టించి మెప్పించారు. ఆయ‌న సినీరంగంలో హీరోగా న‌ట‌జీవితం ఆరంభించినా, త‌ర్వాత విల‌న్‌గానూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గొప్ప న‌టుడు. అవేక‌ళ్లు చిత్రంలో విల‌న్‌గా త‌నలో ప్ర‌త్యేక‌త‌ను చాటారు.  చిలాకా గోరింక హీరోయేనా ఇంత అద్భు తంగా విల‌నీ పండించింది అను కున్నారు ఆ రోజుల్లో. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్‌ ఏలిన రెబల్‌ స్టార్‌ 183కుపైగా చిత్రాల్లో నటిం చారు. భక్తకన్నప్ప, బొబ్బిలిబ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు. చివరిసారిగా ఆయన ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో వెండితెరపై  చివ‌రి సారిగా కనిపించారు.

సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మరో సారి నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.