బాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ!

లోకేష్ చేపట్టిన యువగతం పాదయాత్ర ఆయనను నిజమైన ప్రజా నేతగా మార్చేసిందా? గత 110 రోజులుగా ఆయన పాదయాత్రలో భాగంగా నిరంతరం జనంతో మమేకం అవ్వడంతో వారికి కావలసిందేమిటి? వారికి చేయవలసిందేమిటి అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చిందా? అంటే మహానాడులో లోకేష్ ప్రసంగం విన్న వారంతా ఔననే అంటున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయనకు జగన్  పార్టీ విధానాల వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు ఎదురైన కష్టాలు కళ్లకు కట్టాయి. జనం సమస్యలు ప్రత్యక్షంగా తెలిశాయి.

అంతే కాదు.. జనంలో తిరుగుతూనే వాటికి పరిష్కారాలను కనుగొనేయత్నం చేశారు. ఈ  మొత్తం ప్రక్రియలో ఆయన తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా కంటే జనం మనిషిగా మరింత ఎక్కవ రాటు దేలారు. ప్రజా సమూహాలలో మమేకమైన అనుభవమే ఆయన మంచి వక్తగా మార్చింది. తెలుగుదేశం మహానాడులో ఆయన చేసిన ప్రసంగంలో అదే ప్రతిఫలించింది. అందుకే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, నాలుగేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిగ్గా చెప్పగలిగారు. మహానాడులో అధినేత ప్రసంగంతో సమానంగా లోకేష్ ప్రసంగానికి  స్పందన లభించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోలిస్తే.. ఆ యుద్ధంలో తిరుగులేని విజయం తెలుగుదేశం పార్టీదే అన్న ధీమాను లోకేష్ ఇవ్వగలిగారు. జగన్ ను పిల్ల సైకోగా అభివర్ణించిన ఆయన అంత కంటే పెద్ద సైకోలను ఎదుర్కొన్న అనుభవం తెలుగుదేశం పార్టీది అని విస్పష్టంగా ప్రకటించి ఒక్క చాన్స్ విజ్ణప్తితో అధికార పగ్గాలు అందుకున్న జగన్ ఆ చాన్స్ ను తాను ధనిక సీఎంగా ఆవిర్భవించేందుకు ఉపయోగించుకుని ప్రజలను పేదలగానూ, పేదలను నిరుపేదలుగానూ మార్చేశారన్నారు.

రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలపై కాదు జగన్ చెత్త పన్ను బిల్లులపై తన ఫొటో ముద్రించుకోవాలని సూచించారు. బాబా పాలనలో నిర్మాణాలు జరిగితే.. జగన్ పాలన విధ్వంసాల మయంగా అభివర్ణించిన లోకేష్.. మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.   మహానాడుకు వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం అంటూ ప్రారంభమైన లోకేష్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొంది.   తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం.. పసుపు జెండా చూస్తే పూనకం అంటూ క్యాడర్ లో జోష్ నింపారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల శక్తి ఎన్టీఆర్.. జనానికి కష్టం వస్తే కన్నీరు తుడిచింది. ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది. నిజమైన సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందీ ఆ శక్తేనని లోకేష్ చెప్పారు.  

పార్టీ పెట్టాలంటే హిస్టరీ ఉండాలి.. దానిని నడపాలంటే క్యాలిబర్ ఉండాలి ఆ రెండూ తెలుగుదేశానికి నిండుగా ఉన్నాయన్నారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కు హిస్టరీ ఉంది.. ఆ పార్టీని నడుపుతున్న చంద్రబాబుకు క్యాలిబర్ ఉంది.. ఆ రెండూ లేని పార్టీ వైసీపీ అని ఎత్తి చూపారు. చంద్రబాబు పేరు అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్  అన్న లోకేష్  జగన్ అవినీతి చిరునామా ఎద్దేవా చేశారు.  లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేశ్ ప్రశ్నించారు. బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ వైజాగ్లలో ప్యాలెసులు ఉన్నవాడు పేదవాడా? అని నిలదీశారు.