బీఆర్ఎస్ లో ఉప్పొంగిన ఎన్టీఆర్ భక్తి!

టీఆర్ఎస్ పార్టీ... బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. ఇటువంటి తరుణంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు.. భారీ సంఖ్యలో కారు దిగి.. సైకిల్ ఎక్కి.. చెక్కేసేందుకు.. తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని గులాబీ దళం అధిష్టానం పసిగట్టి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని?... అందులోభాగంగా.. ఎన్టీఆర్ జయంతిని వేదికగా చేసుకొని.. పావులు కదిపిందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా సాగుతోంది.
మే 28వ తేదీ.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి. అయితే ఆయన జయంతి వేడుకలను తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.. ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నడి బొడ్డును ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్..  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే మహానీయుడు, మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అంటూ కిర్తీంచారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భవిష్యత్ ఇచ్చారన్నారు. 

ఇక హన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూలు కట్టి మరీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అయితే తాజాగా బీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల.. పోలిటికల్ సర్కిల్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో టీడీపీ మళ్లీ సత్తా చేటేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగా అన్ని లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట కార్యక్రమాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లి..   తమ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. వాటిలోని వ్యత్యాసం.. లోపాలను క్షుణ్ణ్నంగా ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తోంది.  మరోవైపు తెలంగాణ పదాన్ని సెంటిమెంట్‌గా చేసుకొన్న టీఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం ఆ పదాన్ని పక్కన పెట్టి.. బీఆర్ఎస్‌గా  మారిపోయింది. దీంతో తెలంగాణ ప్రజలు సైతం.. సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే  చర్చ సైతం రాజకీయ వర్గాల్లో   సాగుతోంది.
అదీకాక.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు దాదాపుగా 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లి షికారు కొట్టిన వారేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మరోవైపు.. ముచ్చటగా మూడో సారి కూడా అధికార పీఠం అందుకోవాలనే లక్ష్యంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటూ.. ఇంకోవైపు.. కేసీఆర్‌కి చెక్ పెట్టి పాగా వేయాలని బీజేపీ   తన ఆలోచనలకు మరింత పదును పెడుతూ... ముందుకు సాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం .. దూకుడు మీద ఉంది. అలాంటి తరుణంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి.. అధికారాన్ని అందుకొన్న కేసీఆర్ పార్టీ.. మళ్లీ బీఆర్ఎస్‌గా మారడంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ గెలుపు కష్టమనే భావనతోపాటు.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వెళ్లితే తప్ప... పదవి యోగం ప్రాప్తమవదనే  భావనతో ఎన్టీఆర్ అభిమానులను  తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్  తన వంతు ప్రయత్నాలు చేపట్టిందని..  అదీకాక తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు... రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు పార్టీ గెలుపోటమలను నిర్ణయించడంలో క్రియా శీలకంగా మారనున్నాయి. అటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు ... ఎన్టీఆర్ రాగం అందుకొన్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.