లోకేష్ రెడ్ బుక్.. వాళ్లందరూ వణికిపోతున్నారు!
posted on Feb 12, 2024 4:44AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో అవగాహన ఉన్న ఎవరికైనా ఈ రెడ్ బుక్ లోకేష్ వద్ద ఎందుకుందో తెలిసే ఉంటుంది. ఈ రెడ్ బుక్ ను చూస్తే పసుపు దళంలో ఏదో తెలియని కొ్త్త ఉత్సాహం ఉరకలెత్తుతుంటే, కొందరు అధికారులు, పోలీస్ వర్గాల్లో మాత్రం వణుకు పుడుతోంది. గత ఏడాది కాలంగా ఈ రెడ్ బుక్ ను ఉపయోగిస్తున్న లోకేష్, తాజాగా ఈ రెడ్ బుక్ గురించి మరోసారి కీలకంగా ప్రస్తావించారు. దీంతో ఇంతకీ ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయన్న విషయంపై ఏపీ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. పలువురు అధికారులు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు దగ్గరగా ఉండే నేతల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఐదారు నెలల క్రితం వరకు లోకేష్ రెడ్ బుక్ గురించి లైట్ తీసుకున్న అధికారులు సైతం ప్రస్తుతం రెడ్ బుక్ పేరెత్తగానే వణికిపోతున్నారు. ఇంతకీ వారిలో అంతభయం ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు అలవాటుగా మారిపోయింది. జగన్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించినా పోలీసులతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి స్టేషన్ కు తీసుకెళ్లడం ఏపీలో నిత్యకృత్యంగా మారింది. కొందరు పోలీసులైతే ఏకంగా వైసీపీ నేతలుగా మారిపోయిన పరిస్థితి. దీంతోతెలుగుదేశం శ్రేణుల్లో సైతం ఆందోళన మొదలైంది. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గం, ఎమ్మెల్యే స్థాయి నేతలపై సైతం పోలీసులు జులం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోతెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు సైతం వేయలేక పోయారు. ఒక్క తెలుగుదేశం అనే కాదు.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులతో స్టేషన్ లకు తరలించడమే కొందరు పోలీసు అధికారులకు డ్యూటీగా మారిపోయింది.
ప్రభుత్వ అక్రమ కేసులకు బాధితులుగా మారుతున్న తెలుగుదేశం శ్రేణుల పక్షాన నారా లోకేశ్ పోరాటం సాగిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన అధికారుల పేర్లను నోట్ చేసుకునేందుకు ఓ రెడ్ బుక్ ను లోకేశ్ ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గాల వారిగా టీడీపీ నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసులు, పోలీస్ అధికారుల పేర్లతో పాటు, పలు శాఖల అధికారుల పేర్లను రెడ్ బుక్ లో లోకేష్ నమోదు చేస్తున్నట్లు తెలుగుదుశం వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక వీరందరి అంతు చూస్తామని లోకేశ్ హెచ్చరిస్తూ వస్తున్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేశ్ పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే, చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో సైతం దాఖలు చేసిన సందర్భాలున్నాయి.
లోకేశ్ రెడ్ బుక్ అనగానే ఇన్నాళ్లు లైట్ గా తీసుకున్న అధికారులు.. ప్రస్తుతం వణిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న భావనకు అందరూ వచ్చేశారు. జగన్ తన హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పాటు, అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత విధానాలకు పాల్పడడంతో సమాజంలోని ఏ వర్గానికీ జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న భావనకు ఏపీ ప్రజలు వచ్చేశారు. దీనికి తోడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి విజయం ఖాయమన్న భావన అధికార వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో ఇన్నాళ్లు వైసీపీ నేతల మాటలు విని టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, పోలీసుల్లో ప్రస్తుతం వణుకు పడుతున్నది. తాజాగా శంఖారావం యాత్రలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ను చూపిస్తూ టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదలం.. వడ్డీతో సహా చెల్లిస్తాం. జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తాం అని లోకేష్ హెచ్చరించారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం శ్రేణులపై కక్ష పూరితంగా వ్యవహరించిన అధికారుల్లో వణుకు మొదలైంది. కొందరు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు దగ్గరి వ్యక్తులను సంప్రదించి ఎర్రబుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది..