ప్రాణాలకు ముప్పు.. రక్షణ కల్పించండి మహప్రభో.. ఎస్పీకి దస్తగిరి లేఖ
posted on Mar 13, 2025 1:13PM
.webp)
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉంది రక్షణ కల్పించండంటూ కడప ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ మేరకు ఎస్పీకి లేఖ ఇచ్చాడు. గతంలో తనకు ఇచ్చిన భద్రతను పునరుద్ధరించాలని ఆ లేఖలో కోరాడు. వివేకా హత్య కేసులో సాక్షులు ఒకరి తరువాత ఒకరు చనిపోతుండటాన్ని ఉటంకిస్తూ.. తనకు భద్రత కల్పించాలని కోరాడు. తన ప్రాణాలను రక్షించే విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని దస్తగిరి పేర్కొన్నారు. కడప ఎస్పీకి లేఖ సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన దస్తగిరి.. వివేకాను త్య చేసిందెవరో, ఆ హత్యలో పాల్గొన్నది ఎవరో అన్ని విషయాలూ ప్రజలకు తెలుసునని చెప్పారు. వివేకా హంతకులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించిన దస్తగిరి.. జగన్ కు నేరుగా తనతో మాట్లాడే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
దస్తగిరి అక్టోబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ సమయంలో వైసీపీ నాయకులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిరని దస్తగిరి ఆరోపించారు. అప్పటి ఎస్పీ రామ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని డాక్టర్ చైతన్య రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారనీ, రామ్ సింగ్ గు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని దస్తగిరి చెప్పాడు. అయితే తాను ఆ ఒత్తిళ్లకు లొంగలేదనీ, ఇప్పుడు తనకు ప్రాణభయం ఉందనీ, అందుకే రక్షణ కోరుతున్నాననీ వివరించాడు.