బీఆర్ఎస్ కు షాక్‌లమీద షాక్‌లు .. చేతులెత్తేసిన కేటీఆర్!
posted on Feb 12, 2024 5:16AM
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇబ్బందులు ఎదురైనా భరించుకుంటూ కారులోనే సర్దుకుపోయిన నేతలు. ఇప్పుడు కారు దిగుతున్నారు. మరికొందరు దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 20 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ ఎస్ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని బీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వారంతా బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. గ్రేటర్ లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేజారకుండా కేటీఆర్ రంగంలోకి దిగినప్పటికీ.. అసంతృప్తులు వెనక్కు తగ్గకపోవడంతో కేటీఆర్ సైతం చేతులెత్తేసినట్లు తెలిస్తోంది.
ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజకవర్గాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. అయితే గత రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా తీరును బీఆర్ ఎస్ పార్టీలోని నేతలు సైతం మెచ్చుకుంటున్న పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా రేవంత్ పాలన సాగిస్తున్నారని పలువురు బీఆర్ ఎస్ నేతలు బాహాటంగానే చెబెతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ బీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వీరికి తోడు బీఆర్ ఎస్ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ తలుపు తడుతున్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ తోపాటు పలువురు బీఆర్ ఎస్ కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.
గ్రేటర్ పరిధిలో బీఆర్ ఎస్ కార్పొరేటర్లు భారీ సంఖ్యలో కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. హడావుడిగా బీఆర్ ఎస్ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆ మె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవ్వడం వల్లనే సమావేశానికి గైర్హాజరయ్యారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆమె బాటలోనే మరో 24 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ ఎవరూ పార్టీ వీడొద్దని విజ్ఞప్తి చేశారట. అధికారంలోఉన్న సమయంలో మమ్మల్ని పట్టించుకోని మీరు.. ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే ఉండాలని ఎలా అడుగుతారని కొందరు కార్పొరేటర్లు ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. కేటీఆర్ విజ్ఞప్తి చేసినా కొందరు కార్పొరేటర్లు బీఆర్ ఎస్ ను వీడేందుకే సిద్ధమవుతుండటంతో గ్రేటర్ పరిధిలోని బీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలువురు ముఖ్య నేతలు ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద ప్రస్తావించగా, నేను చెప్పినా వినే పరిస్థితుల్లో కొందరు కార్పొరేటర్లు లేరని, ఇంతకంటే నేనేం చేయాలంటూ చేతులెత్తేశారని గ్రేటర్ బీఆర్ ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో అవినీతి, ఇతర విభాగాల్లో అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. దీనికితోడు అవినీతికి పాల్పడిన నేతలు, అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై రేవంత్ రెడ్డి వేటు వేశారు. మరికొందరు అధికారుల అవినీతిపై విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని ఏకిపారేస్తున్నారు. రేవంత్ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ ఎస్ అధిష్టానానికి ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటం పెద్ద తలనొప్పిగా మారింది.