యువగళం.. లోకేష్ పాదయాత్ర
posted on Dec 28, 2022 11:39AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్రకు ముహూర్తం, పేరు ఫిక్స్ అయిపోయాయి. జనవరి 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు యువగళం అని నామకరణం చేశారు. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగే లోకేష్ పాదయాత్రలో వంద నియోజకవర్గాలు కవర్ చేస్తారు. ఇందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ రెడీ అయ్యింది. లోకేష్ తన పాదయాత్రలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం పరిష్కార మార్గాలు సూచించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
యువగళం పేర లోకేష్ పాదయాత్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రకటించారు. పాదయాత్ర లోగో ఆవిష్కరించారు. లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ గత చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే . నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు.
వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ గతనవంబర్ లో తన పాదయాత్ర తేదీ ప్రకటించారు. ఈ పాదయాత్ర కారణంగా తాను కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటాననీ, అందుకే మంగళగిరి బాధ్యతలను కార్యకర్తలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా లోకేష్ ప్రజలతో మమేకం కానున్నారు. అయితే..అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు.
అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ పాదయాత్ర యువతలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. సీనియర్లు కూడా బద్ధకాన్ని వదుల్చుకుని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు దోహదపడుతుందని అంటున్నారు.