మేనమామనూ జగన్ దూరం పెట్టేశారా ..?
posted on Dec 28, 2022 11:02AM
ఏపీ సీఎం జగన్ కు ఒక్కరొక్కరుగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులూ దూరం అవుతున్నారు. తండ్రి వైఎస్ మరణానంతరం జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉండి, ఆయన జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ పార్టీని భుజాలపై మోసి.. జగన్ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా సహకరించిన వారు ఒక్కరొక్కరుగా దూరం అవుతున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విభేదించిన సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, ఆ తరువాత తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా జగన్ కు స్వయాన మేనమామ.. అంటే తల్లి విజయమ్మకు సోదరుడు అయిన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్ కు దూరం అయ్యారు. జగన్ కు మేనమామ అయినా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అలాగే ఆయన పెరిగింది దాదాపుగా వైఎస్ వద్దే అని చెబుతారు. మొదటి నుంచీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. దీంతో ఆయన తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ కు దాదాపుగా కేర్ టేకర్ గా వ్యవహరించారని చెబుతారు. ఆ కారణంగానే ఇప్పటి వరకు వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే ఇప్పటి వరకూ కమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా, సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఎందుకంటే ఇప్పుడు జగన్ మేనమామకు పార్టీలో ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా పోయింది. అసలు సీఎం జగన్ తన మేనమామ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదనీ, ఇరువురి మధ్యా మాటా మంతీ లేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడిన వారంతా ఇప్పుడు ఆయనకు దూరం అవుతున్నారు. సొంత కుటుంబంలోనే విభేదాల కుంపటి రాజుకుంది. జగన్ సోదరి అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేర సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే.. తల్లి విజయమ్మ జగన్ ను కాదని, వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని మరీ తన కుమార్తెకు తోడుగా వైఎస్సార్టీపీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. జగన్ సంగతి మనకెందుకు అని మీడియా ప్రశ్నలకు ఏపీ సీఎంతో తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు.
వారిరువురూ జగన్ కు దూరం జరిగినా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఇటీవలి కాలం వరకూ జగన్ కే మద్దతుగా నిలిచారు. మేనమామగా ఉన్న చనువుతో రవీంద్రనాథ్ రెడ్డి అవకాశం దొరికిన ప్రతి సందర్బంలోనే సోదరి షర్మిలతో విభేదాలెందుకు అంటూ ఆమెతో సామరస్యం కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది రుచించని జగన్ ఆయనను దూరం పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎదురు పడినా కనీసం పలకరించకపోవడం, అప్పాయింట్ మెంట్ సైతం నిరాకరిస్తుండటంతో రవీంద్రనాథ్ రెడ్డికి విషయం బోధపడి జగన్ కు దూరం జరిగారని అంటున్నారు. ఇటీవల జగన్ కడప జిల్లా పర్యటనకు రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. అయినా జగన్ ఆయనను పట్టించు కోలేదనీ, ఎదురుపడిన సమయంలో కూడా ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
కడప జిల్లాలో ఇప్పుడు సీఎం జగన్, రవీంధ్రనాథ్ రెడ్డిల మధ్య పెరిగిన దూరంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. ఎంత సీఎం అయినా కడప జిల్లాలో వైసీపీ పట్టు నిలవాలంటే కనీసం ఎన్నికల నాటికైనా జగన్ కుటుంబ సభ్యులతో సామరస్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జగన్ తీరుపై జిల్లాలో వైఎస్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోందనీ, వైఎస్ వివేకా హత్య, షర్మిల, విజయమ్మలనూ దూరం పెట్టడంతో పాటు ఇప్పుడు మేనమామను సైతం దూరం చేసుకోవడంపై కడప జల్లాలో జగన్ తీరు పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.