అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు భారీ ఊరట
posted on Sep 29, 2023 11:45AM
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. ఈ కేసులో లోకేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ కే సులో ఏపీ సీఐడీ లోకేష్ ను ఏ 14గా పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలోనే లోకేష్ ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై శుక్రవారం (సెప్టెంబర్ 29)న ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా లోకేష్ కు 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో లోకేష్ ను అరెస్టు చేసే అవకాశం లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఈ సందర్భంగా విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు సూచించింది. కాగా వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగానే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో తనను ఏ14గా చేర్చి, అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ లోకేష్ ముందస్తు బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారు.
మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్కిల్ కేసులో తన తండ్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధంగానే తననూ అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేస్తామంటా సీఐడీ చీఫ్, కొందరు వైసీపీ నేతలూ బహిరంగ ప్రకటనలు చేయడాన్ని లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదనీ, సంబంధిత మంత్రిగా తాను అప్పట్లో లేననీ, ఐఆర్ఆర్ వ్యవహారంలో తానే హోదాలోనూ జోక్యం చేసుకోలేదనీ పేర్కొన్న లోకేష్ తనపై ఈ కేసులో పెట్టిన కేసు చెల్లదని పేర్కొన్నారు.
తాను యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాననీ, దానిని అడ్డుకోవడానికే అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనీ లోకేష్ పేర్కొోన్నారు. జగన్ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం సీఐడీని పావుగా ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం అంగుళం స్థలాన్ని కూడా సేకరించలేదనీ, ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదనీ లోకేష్ పేర్కొన్నారు,