అనుకున్నది సాధించాలంటే!

అనగనగా ఓ మహా పర్వతం. ఆ పర్వతం మీద ఓ దుర్మార్గమైన తెగ ఉండేది. ఆ తెగ ఓసారి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చింది. కింద మైదాన ప్రాంతాల్లో ఉండే ఓ గ్రామం మీద దాడి చేసంది. దాడి చేయడమే కాదు... వెళ్తూ వెళ్తూ తమతో పాటు ఓ పసిపిల్లవాడిని కూడా ఎత్తుకు వెళ్లిపోయింది. ఆ దాడితో గ్రామంలోని జనమంతా బిత్తరపోయారు. కాస్త తేరుకున్న తరువాత, తమ పిల్లవాడిని ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎలాగా! వాళ్లు ఎప్పుడూ ఆ పర్వతాన్ని ఎక్కనే లేదయ్యే! అదో దుర్గమమైన కొండ. ఆ కొండ మీద ఉండే తెగకి తప్ప మిగతా మానవులెవ్వరికీ దాని శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అయినా పిల్లవాడి కోసం ప్రాణాలకు తెగించి బయల్దేరారు.

 

గ్రామంలోని ఓ పదిమంది నిదానంగా కొండని ఎక్కడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ మృగం ఉంటుందో, ఎటువైపు నుంచి ఏ రాయి దొర్లిపడుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ బయల్దేరారు. ఎలాగొలా కొండ శిఖరాన్ని చేరుకున్నా, అక్కడ శత్రువుల కళ్లుగప్పి, వారి చెర నుంచి పిల్లవాడిని తీసుకురావడం ఎలాగా అంటూ బితుకు బితుకుమంటూ నడుస్తున్నారు.

 

ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి.... నాలుగు రోజులు గడిచాయి. కానీ తాము ఎటు పోతున్నామో వాళ్లకి అర్థం కాలేదు. ఒక అడుగు పైకి వెళ్తే నాలుగు అడుగులు కిందకి జారిపోతున్నారు. క్రూరమృగాలని తప్పించుకోలేక సతమతమైపోతున్నారు. తెచ్చుకున్న ఆహారం కాస్తా అయిపోయింది. ఇక మరొక్క అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోయింది. దాంతో పిల్లవాడి మీద ఆశలు వదిలేసుకుని నిదానంగా వెనక్కి తిరిగారు. తిరిగి తమ ఇళ్లకు చేరకుంటే చాలు దేవుడా అన్న ఆశతో తిరుగుప్రయాణం కట్టారు.

 

వాళ్లు తిరిగి వస్తుండగా దారిలో ఆ పిల్లవాడి తల్లి కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు! ఈ కొండ శిఖరాన్ని చేరుకోవడం మనవల్ల కాదు. నీ పిల్లవాడి ఆయువు ఇంతే అనుకో! అక్కడే అతను క్షేమంగా ఉంటాడని కోరుకో. మాతో పాటు వచ్చేసేయి,’ అంటూ ఆమెను చూసి అరిచారు. వారి మాటలు విన్న తల్లి మారు మాటాడకుండా దగ్గరకు వచ్చి నిల్చొంది. ‘నేను పైకి వెళ్లడం లేదు. పై నుంచి కిందకి దిగి వస్తున్నాను,’ అంటూ వెనక్కి తిరిగి తన వీపుకి కట్టుకుని ఉన్న పిల్లవాడిని చూపించింది.

 

‘ఇంతమంది వల్ల కాని పని నీ ఒక్కదాని వల్ల ఎలా సాధ్యమైంది. ఇంత అసాధ్యమైన కొండని ఎక్కి, శత్రువుల కళ్లుగప్పి నీ బిడ్డను ఎలా తెచ్చుకోగలిగావు,’ అని వారంతా ఆశ్చర్యపోయారు. దానికి ఆ తల్లి చిరునవ్వుతో ‘నా పిల్లవాడిని తీసుకురావడం అంటే మీకు బాధ్యత మాత్రమే! కానీ నాకు మాత్రం జీవిత లక్ష్యం. పిల్లవాడు లేనిదే నా జీవితం అర్ధరహితం అనుకున్నాను. అందుకనే వాడి కోసం బయల్దేరాను. ఈ కొండని ఎక్కడం నాకు అంత కష్టం అనిపించలేదు. శత్రువు కళ్లుగప్పడం అసాధ్యంగా తోచలేదు,’ అంటూ చెప్పుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఓ బాధ్యతగా కాకుండా జీవన గమనంగా సాగిస్తే ఏదైనా సాధించవచ్చని ఆ తల్లి నిరూపిస్తోంది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.