భీష్ముని జీవితమే ఓ పాఠం

హిందూ పురాణాలలో ఒకో పాత్రకీ ఒకో ఔచిత్యం కనిపిస్తుంది. కొన్ని పాత్రలు ఎలా జీవించాలో నేర్పితే, మరొకొన్ని ఎలా జీవించకూడదో హెచ్చరిస్తాయి. ముఖ్యంగా మహాభారతమంతా ఇలాంటి భిన్నరకాల పాత్రలు కనిపిస్తుంటాయి. వాటిలో అతి ప్రత్యేకమైనది భీష్ముని వ్యక్తిత్వం. అణువణువునా పరిపక్వతతో తొణకిసలాడే ఆయన జీవితం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. కావాలంటే చూడండి...

 

మాటకు కట్టుబడాల్సిందే

 

భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతానని భీషణమైన ప్రతిజ్ఞను చేసినవాడు కనుకే ఆయనను భీష్మునిగా పిలవసాగారు. తనకు పుట్టే సంతానం, సవతి సోదరుల అధికారానికి అడ్డుపడకుండా ఉండేందుకే ఆయన బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తరువాత కాలంలో ఎవరు ఎన్ని రకాలుగా నచ్చచూపినా భీష్ముడు తన మాట నుంచి తప్పుకోలేదు. సాక్షాత్తు సవతి తల్లి ప్రాథేయపడినా, గురువైన పరశురామునితో యుద్ధం చేయవలసి వచ్చినా.... ప్రతిజ్ఞను విరమించుకోలేదు.

 

మంచి చెప్పి తీరాల్సిందే

 

కౌరవులు క్రూరులని తెలిసినా, దుర్యోధనుడు దుర్మార్గుడని తలచినా తన విధేయతను సడలించలేదు భీష్ముడు. కానీ అవసరం అనుకున్న ప్రతిసారీ దుర్యోధనుని మంచి మాటలు చెబుతూనే వచ్చాడు. వాటిని దుర్యోధనుడు పెడచెవిన పెట్టినా సరే... పెద్దవాడిగా తగిన బుద్ధులు చెప్పేందుకే ప్రయత్నించాడు.

 

తప్పుని ఒప్పుకోవాల్సిందే

 

భీష్ముడికి తాను కోరుకున్న సమయంలో మరణం పొందే వరం ఉంది. అయినా కూడా చిరకాలం జీవించాలని ఆయన అత్యాశ పడలేదు. తను వచ్చిన కార్యం ఎప్పుడైతే ముగిసిపోయింది అనుకున్నాడో, అప్పుడే ఇక తనువుని చాలించాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం తగిన పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. అలా 58 రాత్రులపాటు అంపశయ్య మీద వేచి ఉన్నాడు. ధర్మానికి ప్రతిరూపం అయిన భీష్ముడు తన అంత్యదశలో అంపశయ్య మీద ఉండటానికి కారణం లేకపోలేదు. ఒకనాడు నిండుసభలో కౌరవులంతా ద్రౌపదిని అవమానిస్తుంటే, భీష్ముడు నివారించలేకపోయాడు. ఆనాటి తప్పుకి ప్రాయశ్చిత్తంగా తాను శరతల్పం మీద శయనించానని చెబుతాడు భీష్ముడు.

 

వీరత్వం చూపాల్సిందే

 

భీష్ముడు జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప యోధుడు కూడా! కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలో ఆయనను ఎదుర్కోవడం ఎవరి తరమూ కాలేదు. భీష్ముని శరాఘాతానికి రోజూ వేలాది మంది పాండవ వీరులు మృత్యువాత పడ్డారు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు కూడా, భీష్ముని నుంచి అర్జునుని కాపాడేందుకు ఆయుధాన్ని పట్టవలసి వచ్చింది. ఆడామగా కాని శిఖండని అడ్డుపెట్టుకోలేకపోతే కనుక భీష్ముని ఓడించడం ఎవరి తరమూ అయ్యేది కాదు.

 

జ్ఞానం పంచాల్సిందే

 

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ ధర్మరాజు మనసులో ఏదో అశాంతి. ఏదో ఆందోళన. తన సామర్థ్యం మీద తనకే ఎంతో అపనమ్మకం. రాజనీతికి సంబంధించి ఏవో అనుమానాలు..... ధర్మరాజు మనసులో అలజడిని గమనించిన శ్రీకృష్ణుడు, ఆయనను భీష్ముని వద్దకు తీసుకునివెళ్లాడు. ఆ సమయంలో భీష్ముడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. అయినా తన చెంతకు వచ్చిన ధర్మరాజుని చూసి ఆయన మనసులోని ప్రతి అనుమానాన్నీ నివృత్తి చేశాడు. రాజనే వాడు ఎలా ఉండాలి! ఎవరితో ఎలా మెలగాలి! లోకం తీరు ఎలా ఉంటుంది! అంటూ తనకి ఉన్న అనుభవాన్నంతా బోధలుగా, కథలుగా మార్చి ధర్మరాజుకి అందించాడు. అలా భీష్ముడు చేసిన బోధలతో భారతంలోని శాంతిపర్వం, అనుశాసనిక పర్వాలు అద్భుతంగా తోస్తాయి.

- నిర్జర.