పులిరాజును కాపాడుకుందాం!

భారతదేశ జాతీయ జంతువు పులి. నిజానికి భారతీయ హిందూ ధర్మంలో ప్రతిజంతువును కూడా దైవరూపంగా భావిస్తారు. దేవతలకు వాహకాలుగా భావించి వాటి పట్ల భక్తిగా ఉంటారు. కానీ ఎక్కడైనా పాము, లేక ఇతర జంతువులు ఏమైనా కనబడితే మాత్రం వాటిని కొట్టి చంపేయడం చేస్తారు. కారణం వాటివల్ల మనుషులకు హాని జరుగుతుందనే భయం. అలా మనుషులు చంపుకుంటూ పోతున్న వాటిలో భారతదేశ జాతీయ జంతువు పులి ఉనికి ప్రమాదంలో పడింది.

మనిషి తన మనుగడను అభివృద్ధి చేసుకునేకొద్ది చుట్టూ ఉన్న పరిసరాలను చాలా మార్చేస్తున్నాడు. ముఖ్యంగా అడవుల విషయంలో జనాభా పెరుగుదల కారణాలు చెప్పి అడవులను నరికేస్తున్నాడు. ఫలితంగా అడవులలో పెరుగుతున్న జంతువుల నివాసానికి ముప్పు ఏర్పడింది. వాటికి తిండి, నీరు విషయంలో ఎంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే అవి జనావాసప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి. అయితే మనుషులు వాటిని హింసపెట్టి మరీ చంపుతారు. కొందరు వేటాడటం వల్ల, మరికొందరు వాటిపట్ల కఠినంగా ప్రవర్తించడం వల్ల వాటి సంతతి సరైన విధంగా అభివృద్ధిచెందక వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతిసంవత్సరం జులై 29వ తేదీన జరుపుకుంటారు. ఈరోజున పులుల సంరక్షణ కోసం చేపట్టాల్సిన పనులు, అవి నివసించే ప్రాంతాలను ఎలా అభివృద్ధిచేయాలి? వాటిని ఎలా రక్షించాలి?? దానికోసం ఎలా అడవులను సంరక్షించాలి వంటి విషయాల గురించి చర్చించి, వాటిని అమలుపరిచే విధానం గురించి నిర్ణయం తీసుకుంటారు.

పులుల సంఖ్య భారీగా తగ్గిపోయిందా?

ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోవడం నిజమే. గత వందసంవత్సరాల చరిత్రను గమనిస్తే పులుల సంఖ్య చాలా విస్మయపరిచేంతగా తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 1913లో దాదాపు 1,00,000 పులులు ఉండేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 3200గా మారిపోయింది. వందేళ్ల కాలంలో దాదాపు 97% పైన పులులు అంతరించిపోయాయి.  ఈ విషయాలు అన్నీ తెలిసిన తరువాత యావత్ ప్రపంచదేశాలు అయోమయంలో పడిపోయాయి. 2010 సంవత్సరంలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జులై 29 వ తేదీన పులుల సంరక్షణ దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు.

భారతదేశంలో పులుల సంరక్షణ ఎలా ఉంది?

భారతదేశంలో 18 రాష్ట్రాలలో 51 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.  2018లో చివరిసారి పులుల గణన చేసినప్పుడు వాటి  పెరుగుదల కనిపించడం అందరి సంతోషానికి కారణమైంది.  సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే పులుల జనాభాను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని భారత్ సాధించడం చాలా హర్షించాల్సిన విషయం.

కారణాలు!

పులుల సంఖ్య తగ్గిపోవడానికి కారణాల గురించి ఆరాతీస్తే పూర్తిగా మనుషులు చేస్తున్న పనుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం మనిషితత్వానికి మచ్చ తెస్తోంది. 

జనాభా పెరుగుదల పేరుతో అడవులను క్రమంగా పంటపొలాలుగానూ, నివాస ప్రాంతాలుగా మార్చడం

జంతువుల ఎముకలు, చర్మం మొదలైన వాటికి గిరాకీ బాగా ఉండటం వల్ల వాటికోసం చంపడం.

చిన్న జీవుల మీద ఆధారపడి పెద్ద జీవులు బ్రతుకుతాయి. పులి, సింహం లాంటి జ్ఞాతువులు వేటాడటానికి కూడా తగిన జంతువులు అడవుల్లో ఉండాలి కానీ అవి కూడా చాలా కనుమరుగైపోతున్నాయి.

ప్రకృతి విపత్తులు  జరిగినప్పుడు వాటి నివాసప్రాంతాలు దెబ్బతిని ఆవాసం కోల్పోవడం.

పులుల కోసం తీసుకురాబడిన చట్టాలు!

1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరుతో ఇందిరాగాంధీ చట్టాన్ని తీసుకువచ్చారు. దానిద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపట్టారు.

◆ 2010 సంవత్సరంలో 13 దేశాలు ఏకగ్రీవంగా ఒక తీర్మానం తీసుకున్నాయి. 2022 సంవత్సరానికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

2018కి  పులుల సంఖ్య 3000 కాగా ఆ సంఖ్యను 6000 కు పెంచేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

పులుల సంఖ్య పెరగడానికి ఏమి చేయొచ్చు?

అవగాహన కల్పించడం అందరి బాధ్యత. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా అభయారణ్యాలలో పులుల సంచారం ఎక్కువ ఉంటుంది. అవి తిరిగే ప్రాంతాలకు వెళ్లి వాటిని భయపెట్టడం, వాటి జీవనానికి ఇబ్బంది కలిగించడం మనుషులకు సరదా అయిపోయింది. ఒకప్పుడు మనుషులు జీవించే ప్రాంతలలోకి అడవు జంతువులు ఎలాగైతే వచ్చేవి కావో, మనుషులు కూడా వాటి విషయంలో అలాగే ఉండాలి. వాటి మానాన వాటిని బతకనిస్తే వాటి సంతతి పెరుగుతుంది.

దత్తత తీసుకోవడం. ఇదేంటి వింతగా అనుకుంటున్నారా?? సాధ్యమైనవాళ్ళు ఒక పులిని దత్తత తీసుకోవచ్చు. దాన్ని ఇంట్లో పెట్టుకోవాలా అని భయపడకండి.  దాని సంరక్షణ, దాని బాధ్యత, దాని పెరుగుదలకు కావాల్సిన అన్నిటి ఖర్చు భరిస్తే చాలు. వాటి ఆహారం కోసం అటవీ, జంతు సంరక్షణ వాళ్లకు  పెద్దమొత్తమే ఖర్చు అవుతుంది. వాటికోసం అందరూ తమ చేయూత అందిస్తే వాటికి ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతారు.

కొందరికి సాహసాలు ఇష్టం, సాహసవంతమైన జీవితం ఇష్టం. ఇలాంటివాళ్లు కేర్ టేకార్స్ గా ఉండి పులుల సంరక్షణ చూసుకోవచ్చు.

విరాళాల సేకరణ మరొక సహాయం. విరాళాలు సేకరించి పులుల సంరక్షణ, ఆరోగ్యం కోసం అందజేయవచ్చు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇలాంటివి చేయచ్చు. అయితే జాగ్రత్త కొందరు ఫ్రాడ్ చేయొచ్చు.

పులుల గురించి అయిదు ఆశ్చర్యకరమైన విషయాలు!

పులుల అరుపు రెండు మైళ్ళ వరకు వినిపిస్తుందట.  

ఇవి 40/mph వేగంతో పరిగెడతాయి.

సగటు పులి బరువు సుమారు 800.278 పౌండ్స్ ఉంటుంది.

పులి పిల్లలు వేటలో మొదటిసారి సక్సెస్ కాలేవు. రెండు మూడు ఫెయిల్యూర్స్  తరువాత సక్సెస్ అవుతుంది.

◆ ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో ఆశ్చర్యంగా భారతదేశంలోనే 70% ఉన్నాయి.

                                ◆ వెంకటేష్ పువ్వాడ.