టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుడు జగన్ అభిమాని? 

హైదరాబాద్ లోని టీవీ5 న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. గురువారం ఓ వ్యక్తి  జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న టీవీ 5 కార్యాలయానికి చేరుకున్నాడు. అనంతరం కార్యాలయం అద్దాలపై రాయితో దాడిచేశాడు. ఈ ఘటనలో కార్యాలయ అద్దం దెబ్బతినడంతోపాటు ఓ వైద్యుడి కారు అద్దాలు పగిలిపోయాయి. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీవీ 5 కార్యాలయానికి వచ్చిన వైద్యుడు శ్రీధర్‌రెడ్డి కారుపై ఆ రాయి పడడంతో దాని అద్దం పగిలింది. అప్రమత్తమైన టీవీ 5 సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. టీవీ5 సిబ్బంది ఫిర్యాదులో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. 

టీవీ5 కార్యాలయంపై రాయి విసిరిన వ్యక్తిని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దలపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి (37) గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్టు  ప్రాథమికంగా నిర్దారించారు. అతడిని పోలీసులు విచారించగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమాని అని తేలినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ టార్గెట్ గా వరుసగా కథనాలు ప్రసారం చేస్తున్నారనే కోపంతోనే దాడికి పాల్పడినట్లు తేజేశ్వర్‌రెడ్డి పోలీసులకు చెప్పారని చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని లోతుగా విచారిస్తున్నారు. మద్యం మత్తులో అతనే చేశాడా లేక ఎవరి ప్రోద్బలం అయినా ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారని సమాచారం. గతంలోనూ టీవీ5 కార్యాలయంపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది.