మంత్రికో న్యాయం.. ఇదెక్కడి అన్యాయం?

మాకో రూలు, మీకో రూలు ఇదెక్కడి న్యాయం? చట్టసభల్లో, రాజకీయ చర్చల్లో తరచూ విని పించే ప్రశ్న ఇది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వమో, అధికార యంత్రాంగమో ఇంకొకరో వ్యతాసం, వివక్ష చూపించి నప్పుడు, ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావును ఇదే ప్రశ్న బోనులో నిలబెట్టింది. అవును, ఆయన తమ సహచర మంత్రుల మధ్య వివక్ష చుపుతున్నారా ... ఒక్కొక్కరికీ ఒక్కొక్క రూల్ అప్లై చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఈ వివక్షే ఇప్పుడు ఆయన్ని బోనులో నిలపెట్టిందని అంటున్నారు.  

ఈ సంవత్సరం (2021) మే మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు దశాబ్దాలకు పైగా తమ వెంట ఉన్న సహచర మంత్రి ఈటల రాజేందర్ పై ఎవరో చేసిన ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు వచ్చిందే తడవుగా, ఆగమేఘాల మీద విచారణ జరిపించారు. అంతే వేగంగా అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. అంతకంటే ఇంకా వేగంగా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. చివరకు ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవరకు, అధికార తెరాస నాయకులు వెంటాడారు. తప్పు లేదు, ప్రభుత్వ ప్రతిష్ట  దెబ్బతినకుండా, ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిల్ల కుండా ముఖ్యమంత్రి ఈటల మీద చర్యలు తీసుకున్నారు. అలాగే, పార్టీ ప్రతిష్ట కాపాడేందుకు తెరాస అధ్యక్షుని హోదాలో పార్టీ నుంచి కూడా దిగ్విజయంగా బయటకు పంపారు. అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు.ఇక కేసు విషయానికి వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 

అయితే  మంత్రుల మీద అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటి సారా? అప్పుడెప్పుడో  ఇలాగే, ఇంతే అవమానకరంగా మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీద, మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళకు బడుగు బిడ్డ ఈటల రాజేందర్ మీద తప్పించి ఇంకెవరి మీద అవినీతి ఆరోపణలే రాలేదా?. సరే  గతం గతః గతాన్ని వదిలేసినా, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మంత్రులను పక్కన పెట్టినా, ఈటలపై వేటు వేసిన తర్వాత అదే విధమైన ఆరోపణలు వచ్చిన వారిని ఎందుకు వదిలేశారు. ఈటల మీద వేటు తర్వాతే కదా, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై అదే తరహ ఆరోపణలు చేసింది? అది కూడా ఏ దేవయాంజిల్ దేవుడి భూములను ఈటల ఆక్రమించుకున్నారని అంటున్నారో, ఆరోపిస్తున్నారో, అదే దేవయాంజల్ భూములలో మంత్రి కేటీఆర్, మరో తెరాస వ్యాపార వేత్త, నమస్తే తెలంగాణ చైర్మన్, ఎండీ దామోదర రావుకు కూడా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా .. అందుకు తమ వద్ద  ఆధారాలు ఉన్నాయని బహిరంగగా సవాలు విసిరారు కదా, మరి అలాంటప్పుడు ఈటల మీద ప్రయోగించిన మంత్ర దండాన్ని మంత్రి  కేటీఆర్ మీద ఎందుకు ప్రయోగించలేదు? మంత్రివర్గం నుంచి తొలిగించక పొతే పాయ్, కనీసం ఒక కంటి తుడుపు విచారణ అయినా ఎందుకు జరిపించలేదు? ఎందుకీ వివక్ష? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

మంత్రి శ్రీనివాస గౌడ్ పై మహబూబ్ నగర్ కు చెందిన విశ్వనాథ రావు, పుష్పలత దంపతులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక పాత కేసుకు సంబంధించి తాము సాక్షులుగా ఉన్నందున  మంత్రి, మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ తమపై కక్ష కట్టి స్థానిక సీఐ మహేశ్వర ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేదిస్తునారని, ఉద్యోగం తీయించి  బాధలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే, మంత్రి మీద చర్యలు లేవు  సరికదా, బాధితుల కథనాన్ని లైవ్’లో చూపిన క్యూ న్యూస్ చానల్ (తీన్మార్ మల్లన్న) పై పోలీసులు సోదాలు పేరుతో దాడులు చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అందరిని  సమానంగా  చూడడం, సమ న్యాయం పాటించడమే కాదు, పాటిస్తున్నట్లుగా కనిపించడం కూడా ముఖ్యమే అంటారు పెద్దలు. ఈటల వ్యవహారంలో ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా మంత్రుల మది వివక్ష చూపడమే కాదు, ఆ బొమికలు మెళ్ళో వేసుకుంటున్నారని అంటున్నారు.  ఈ అన్నిటినీ మించి, ఇపటికే ఇతరత్రా ఆరోపణలు ఎదుర్కుంటున్న కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్’కు ఏకంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.  మంత్రి కి సంబందించిన కంపెనీ గ్రానైట్ తవ్వకాలు, తరలింపులో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఈడీ రూ.360 కోట్ల పెనాల్టీ విధించింది. కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఈటలపై వేటు వేసిన ముఖ్యమంత్రి, ఏకంగా ఈడీ పెనాల్టీ విధించిన గంగుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ప్రజా కోర్టు ప్రశ్నిస్తోంది. 

అంతే కాదు ఈటల మీద వేటు వేయడానికి  వేరే కారణం ఉందని, అవినీతి ఆరోపణలే ప్రామాణికంగా తీసుకుంటే, ముఖ్యంగా ఈటల మీద చేసిన ప్రధాన ఆరోపణ, అసైన్డ్ భూముల అక్రమ ఆక్రమణే ప్రామాణికంగా తీసుకుంటే, పార్టీలతో ప్రమేయం లేకుండా కనీస సగానికి పైగా ప్రస్తుత,  మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజా ప్రతినిదులలో సగం మందికి  పైగా అదే కోవలోకి వస్తారు. ఆ సంగం మందిలో ఈటలే కాదు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యలు కూడా ఉంటే ఉండ వచ్చును. అందుకే కేసీఆర్ ప్రజా కోర్టు బోనులో నిలబడవలసి వచ్చిందని అంటున్నారు. హుజురాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఈటల విషయంలో కేసీఆర్ ప్రత్యర్ధుల నుంచే కాదు, ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈటల ఎపిసోడ్ కేసీఆర్ రాజకీయ జీవితంపై ఒక మాయని మరకగా మిగిలిపోతుందని అంటున్నారు.