ట్రబుల్ షూటర్ వ్యాఖ్యలతో ట్రబుల్? గులాబీలో హుజురాబాద్ టెన్షన్? 

హుజూరాబాద్‌లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? ఈ ప్రశ్నకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులు సమాధానం చెపితే, అది సబబుగా ఉంటుంది. కానీ, తమ పార్టీ అభ్యర్ధి ఎవరో చెప్పలేని తెరాస ట్రబుల్ షూటర్ తగుదునమ్మా, అని కాంగ్రెస్ దళిత అభ్యర్ధిని పోటీలో దించుతోందని, చెప్పడం ఏమిటి? ఏం దళితులు పోటీకి పనికిరారా? రాజ్యాధికారానికి అర్హులు కాదా, బాంచను దొరా ‘ అంటూ దొరల అడుగులకు మనుగులొత్తాలా? అని దళిత సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల చోటామోటా నాయకులు,కార్యకర్తలు  సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గురువారం తెరాస లో  చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన తెరాస ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్‌లో దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వేరే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా, మరి కొందరు దళిత నేతలతో పోటీ చేయించాలని బీజేపీ చూస్తోందని హరీష్ ఆరోపించారు.దళిత బంధు పథకంతో దళితులందరూ తెరాస  వైపే నిలవడాన్ని కాంగ్రెస్‌, బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు.

హరీష్ చేసిన వ్యాఖ్యలు, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు దళిత వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన దళితులను విస్మరించి, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించిన తెరాసకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే దళితులు ఎక్కువ అవమానాలు అనుభవిస్తున్నారని అన్నారు.

కేసీఆర్‌కు ఏడేళ్ల తరువాత దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని, దళితులను మరోసారి మోసగించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, త్యాగాలంటే తెలియని వారే,  పదవులు అనుభవించటం దుర్మార్గమని, ఒక్కశాతం ఉన్న వెలమ, 4 శాతం ఉన్న రెడ్లకు మెజారిటీ పదవులు ఇచ్చారని, అధిక శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అరకొరగానే పదవులు దక్కాయన్నారు. అలాగే, దళిత ఎజెండా జెండాగా చేసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన మాజీ ఐపీఎస్ ప్రవీణ కుమార్ అయితే, దళిత బందు వంటి పథకాలు దళితుల అభివృద్ధికి ఉపయోగపడేవి పడేవి, కాదని, దళితుల ఓట్ల కోసం జరుగుతున్న కుట్రగా ఎప్పుడోనే పేర్కొన్నారు. దళిత బంధు బదులు దళితుల విద్యావకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేయాలని, గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. 

అవును దళిత బంధు పథకం దళితుల పట్ల ప్రేమతో కాదు, దళితుల ఓట్ల మీదున్న ప్రేమతోనే తీసుకు వచ్చామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత, విపక్షాలు దళితుల ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించడంలో అర్థమేమిటని ప్రతిపక్ష పార్టీలు  ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీ నాయకులు కూడా, ఒక్క అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక కోసం ప్రభుత్వ యంత్రంగాన్ని, నిధులను ఈ స్థాయిలో దుర్వినియోగం చేయడం ఇంతవరకు చూదలేదని, ఇంత చేసిన తర్వాత కూడా అధికార పార్టీ ఓడిపోతే, తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అలాగే,  రానున్న ఎన్నికల్లో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని, అదే తెరాస అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపు తున్నాయి. తెలంగాణ వచ్చినా ఇంటికో ఉద్యోగం రాలేదు గానీ, కేసీఆర్  ఇంట్లో మాత్రం ఐదారు ఉద్యోగాలు వచ్చాయని, అలాగే, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికీ మంత్రి పదవులు,  ఉద్యమకారులపై రాళ్ళేసిన వారికి పార్టీలో చేరిన పది రోజులకే ఎమ్మెల్సీ పదవులు వచ్చాయని, తెరాస అభ్యర్ధి గెలిస్తే, హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం జరగడం  కూడా అంతే అని  నిరుద్యోగ యువకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న సమీపిస్తున్నకొద్దీ తెరాసలో  ఓటమి భయం పెరుగుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెరాసలో అయితే హుజూరాబాద్ కొంప ముచుతుందనే ఆందోళన వ్యక్తమవుతోందని  అంటున్నారు.