నంద్యాల బంద్.. బంద్..
posted on Nov 1, 2014 10:20AM

కర్నూలు జిల్లాలో నంద్యాలలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్‌కి పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్ల మీద వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ అమానుష దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో నంద్యాలలోని విద్యా, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు మూతపట్టాయి. కౌన్సిలర్ల మీద దాడికి సంబంధించి అదే సమావేశంలో వుండి వైసీపీ సభ్యులను దాడికి ప్రేరేపించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీద రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ నంద్యాలలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.