కేయూ విద్యార్థుల అరెస్టుపై ఉద్రిక్తత
posted on Sep 8, 2011 2:20PM
వరంగల్: మంత్రి పొ
న్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించిన కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులను అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు విద్యార్థులను స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉంచకుండా ఇతర పోలీసు స్టేషన్‌లకు తరలించడం పట్ల ఆగ్రహం చెందిన విద్యార్థులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. తమ విద్యార్థులను ఇతర పోలీసు స్టేషన్‌లలోకి తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.
ఇతర పోలీసు స్టేషన్‌కు విద్యార్థులను తరలించడం పట్ల కోర్టు సైతం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్లోనే ఉంచకుండా ఇతర పోలీసు స్టేషన్లకు ఎందుకు తీసుకు వెళ్లారంటూ పోలీసులను ప్రశ్నించింది. కాగా బుధవారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి పలువురు కాకతీయ విద్యార్థులు చొచ్చుకెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు అనుకూలంగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.