హజారే ఉద్యమం వల్లే గాలి అరెస్ట్: డీఎల్

హైదరాబాద్: అన్నాహజారే ఉద్యమం వల్లే గాలి అరెస్టయ్యారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. అవినీతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ అక్రమాలలో అరెస్టయిన గాలి జనార్ధన్ రెడ్డికి అన్నలాంటి వాడని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శించారు. గాలిని దివంగత వైయస్‌కు పరిచయం చేసింది జగనే అన్నారు. బళ్లారిలో గాలి అనుమతి లేకుండా గాలి కూడా వీయదని అంటారన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణలో కాంగ్రెసుకు సంబంధం లేదన్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందలు, వేల కోట్లు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. తనను కడప ఉప ఎన్నికల్లో ప్రజలు గెలిపించి, విపక్షాలకు డిపాజిట్ గల్లంతు చేశారని దానిని బట్టి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదనే ప్రజల ఉద్దేశ్యమని జగన్ అంటున్నారని కాని అది సరికాదన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్‌ను గెలిపించారన్నారు. సిబిఐ విచారణ స్వాగతిస్తున్నామంటూనే దర్యాఫ్తు ఆపాలని కోరుతూ జగన్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదన్నారు. యుపిఏ ప్రభుత్వం తనపై క్కష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఉండగా కాంగ్రెసును ఎందుకు విమర్శిస్తున్నారన్నారు. యుపిఏ మిత్ర పక్షమైన డిఎంకెకు చెందిన కలైంజ్ఞర్ టీవి పైనా సిబిఐ దాడులు చేస్తోందన్నారు. జగన్ వినతి పత్రం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కాలేదన్న జగన్ తాను అంత ఆస్తి ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. జగన్‌చే ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తే బావుంటుందన్నారు. సండూరుకు 5 బినామీ కంపెనీలను సృష్టించి అక్రమంగా రూ.500 కోట్లు సేకరించ లేదా అని ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu