కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు?

ప్రతి పార్టీకి ఒక సిద్దాంతం, ఒక రాజకీయ పంథా ఉంటాయి. అలాగే, ప్రతి ప్రభుత్వానికి ఒక ఆర్ధిక విధానం, ఆర్థిక ప్రాధాన్యతలు ఉంటాయి. ఆ ప్రకారంగా పార్టీలు, ప్రభుత్వాలు పని చేస్తాయి.అంతే, కానీ, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఒకే రీతిగా, ఒకేలా ఉండవు. ఒకే విధంగా పని చేయవు. అందులోనూ ప్రాంతీయ్ పార్టీల ఆలోచనా ధోరణీ, జాతీయ పార్టీల ఆలోచన ధోరణి ఒకేలా అసలే ఉండవు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు మధ్య భావిలో కప్పకు  సముద్రంలో చేపకు ఉన్నంత తేడా ఉంటుంది. 

అయితే, అదేమిటో తెరాస నాయకులు, మంత్రులు మాత్రం,అన్నిటికీ నన్నుచూడు అందం చూడు  అన్నట్లుగా అన్ని పార్టీలకు సుద్దులు చెపుతుంటారు. మంత్రి కేటీఅర్’లాగా ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలలోనూ వేలు పెడతారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజే మంత్రి శశి థరూర్ గురించి ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత అందుకు ఆయనకు రేవంత్ క్షమాపణలు చెప్పారు... శశి థరూర్ కూడా రేవంత్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఏ సందర్భంలో చేశారో అర్థం చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఆ విషయాన్ని మరిచి పోయారు.   కానీ, కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లుగా కేటీఆర్ మాత్రం అదే విషయాన్ని పట్టుకుని, పదే పదే గుర్తు చేసి ఎద్దేవా చేస్తున్నారు. 

తాజాగా, మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన, కేటీఆర్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి ప్రశ్నించారు. అలాగే, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంటే, షర్మిల ఏమి మాట్లాడాలో, ప్రవీణ్ కుమార్ ఏమి చేయాలో కూడా ఈయనే చెపుతారా? ఇదెక్కడి ధోరణి, అంటూ రాజకీయ వర్గాలు కేటీఆర్ వింత ధోరణిని  అసహించు కుంటున్నాయి. జాతీయ పార్టీలు లేకుంటే, తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? అని  ప్రశ్నిస్తున్నారు. 

అలాగే, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీ బంధు పెట్టాలని కీసీఅర్ డిమాండ్’ను కూడా రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ తెలంగాణాలో అమలవుతున్నాయా, అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం తెలంగాణ చేసినన్ని అప్పులు ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయవు, అని ప్రశ్నించలేదు, అంటూ విస్మయం వ్యక్తపరుస్తున్నారు.  నిజమే కావచ్చు, అటు నుంచి కాంగ్రెస్, ఇటు బీజేపీ దూసుకొస్తున్న నేపధ్యంలో, రేపు ఏమవుతుందో ? ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుందేమో అన్న నిరాశ,నిస్పృహలు కమ్ముకొస్తున్న సమయంలో, సహజంగానే మాటలు తడబడతాయి ... అయినా, రాజకీయ నాయకులు నోరు జారి గీత దాటడం మంచి కాదని అంటున్నారు, హితేషులు.