హైకోర్టు‌లో కేటీఆర్‌కు ఊరట.. రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం

 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 

కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఉట్నూరులో జరిగిన ఒక సభలో మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల నిధుల కోసం మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది.