మా నాన్న రెండు సార్లు సీఎం.. నీలాగా అడ్డగోలుగా సంపాదించలేదు
posted on Feb 11, 2021 5:10PM
ఎపి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఉమ్మడి ఏపీకి రెండు సార్లు సీఎంగా పని చేశారని, అంతేకాకుండా తాను కూడా ఒక సారి కేంద్ర మంత్రిగా పని చేశానని... అయితే తాను ఏనాడూ డబ్బుకు కక్కుర్తి పడలేదని అయన అన్నారు. అదే సమయంలో జగన్ మాత్రం ఆయన తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు కోట్లు సంపాదించాడని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతల బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బాగుండటమే తమకు కావాలని అయన అన్నారు. ప్రజాసేవ ఒక్కటే తమ లక్ష్యమని అయన తెలిపారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము ఈ పోలీసులకు ఉందా? అని అయన ప్రశ్నించారు.