వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్ఈసీ సీరియస్
posted on Feb 11, 2021 8:52PM
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఎస్ఈసీ... ఆయనపై చర్యలకు ఆదేశించింది.
వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చుక్కల్లో పడ్డారు. వార్డు మెంబర్‌గా పోటీచేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ’ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని..అయినా..వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం జోగి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.