'కొండా'ను పిండి చేస్తున్న ప్రత్యర్థులు!

పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిని, తాజామాజీ కొండా సురేఖపై అన్ని పార్టీలూ విమర్శనాస్త్రాలను గుప్పిస్తున్నాయి. వివిధ పార్టీల నాయకులు చేస్తున్న టార్గెట్ తో కొండా సురేఖ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు కొండా దంపతులను అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణిస్తున్నారు. కొండా దంపతుల గూండాగిరీ తగ్గాలంటే ఓటర్లు టి.ఆర్.ఎస్.కు ఓటేసి బుద్ధి చెప్పాలని ఆ పార్టీ ఉపనేత హరీష్ రావు పిలుపునిస్తున్నారు. టి.ఆర్.ఎస్. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణా ద్రోహి ఎర్రబెల్లి, కొండా మురళీధర్ చీకటి నేస్తాలని ఆరోపించారు. సమైక్యవాదాన్ని మోస్తున్న కొండా సురేఖకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని టీజీఎ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అన్నారు. కొండా సురేఖ వన్నీ కట్టుకథలే అని బిజెపి నాయకుడు కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఇలా ఒకపక్క టి.ఆర్.ఎస్. మరోపక్క బిజెపి, వీరితో పాటు పోటీగా కాంగ్రెస్, టిడిపి పరకాలలో కొండా సురేఖపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో ముందంజవేస్తున్నారు. అసలు తెలంగాణా రాకపోవటానికి సురేఖ వైఖరే కారణమని ఉదాహరించాతానికి ఈ పార్టీలు కొత్త కొత్త అంశాలు కూడా వెదుకుతున్నాయి. అలానే మౌఖికప్రచారంతో సురేఖను అప్రతిష్టపాలు చేయటం ద్వారా ఓట్లు పొందాలని ప్రతిపార్టీ మిగిలిన వాటితో పోటీపడుతున్నాయి.

 

 

ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి పంచముఖ పోటీ ఉంటుందని అంచనా. తాజామాజీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు, టిడిపి ధర్మారెడ్డి, టి.ఆర్.ఎస్. ఎం. భిక్షపతి, బిజెపి అభ్యర్థి డాక్టర్ చంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఓట్లు చీలక తప్పదు. ఈ చీలిక ఏ పార్టీకి ప్లస్ అవుతుందో? ఏ పార్టీకి మైనస్ అవుతుందో? అన్న విషయంపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. పరకాలలో టి.ఆర్.ఎస్., బిజెపి ఓటమిపాలైతే అక్కడి ప్రజలు కూడా సమైక్యవాదాన్ని కోరుకున్నట్లేనని గుర్తించాలని మేథావులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu