కోడెల ఆత్మహత్య వెనక బాబు హస్తం.. ఉదయం 9 గంటలకు?
posted on Sep 17, 2019 3:08PM
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా టీడీపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని అయితే అసలు కోడెల ఆత్మహత్యకు టీడీపీ అధినేత చంద్రబాబు కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా చంద్రబాబు కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. తాను నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే కోడెల ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. సోమవారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం కోడెల ప్రయత్నించగా దొరకలేదనీ, దీంతో కోడెల తీవ్ర మనోవేదనకు లోనయ్యారని నాని చెప్పారు.
కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తి అని నాని వ్యాఖ్యానించారు. కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫర్నీచర్, బిల్డర్ల కేసులు తమ ప్రభుత్వం పెట్టలేదని నాని అన్నారు. ‘ఏ కేసులోనూ కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెలకు మేం నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. పార్టీ నుంచి దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో వర్లరామయ్యతో విమర్శలు చేయించారు.' అని నాని వ్యాఖ్యానించారు.
1999 బాంబుల కేసులో కోడెలపై విచారణ జరిపించి అవమానించింది చంద్రబాబు కాదా? ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా? ఇప్పుడు కోడెలను పల్నాటి పులి అంటున్న చంద్రబాబు, గతంలో కోడెలను పల్నాడుకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించారు. గతంలో నరసరావుపేట నుంచి కోడెలను సత్తెనపల్లికి పంపి అవమానించింది చంద్రబాబు కాదా? అని నాని నిలదీశారు. కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌ను చేసారని నాని విమర్శించారు.
కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో ఓ వర్గాన్ని చంద్రబాబు తయారుచేశారని నాని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కోడెల భౌతికకాయం వద్ద కూర్చుని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కోడెల చనిపోయారని మీడియాలో వార్తలొచ్చినా పిల్లిలా చంద్రబాబు దాక్కున్నారని విమర్శించారు. సూసైడ్ నోట్ దొరుకుతుందా అని భయపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. సూసైడ్ నోట్ లేదని తెలిసి.. పులిలా మారావని బాబుని విమర్శించారు. 'కోడెలను ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఈ 3 నెలల్లో చంద్రబాబు మాట్లాడారా..? కనీసం ఆయనకు మద్దతుగా కూడా ఎవ్వరిని మాట్లాడనివ్వ లేదు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి’ అని కొడాలి నాని డిమాండ్ చేశారు.