కొల్లం ఘటన ఎఫెక్ట్.. మనసు మార్చుకున్న కర్ణాటక


మొత్తానికి కేరళ కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం వల్ల పలు రాష్ట్రాలు కళ్లు తెరిచినట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలమందికి గాయాలయ్యాయి. ఈనేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగకుండా కర్ణాటక వాసులు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. పాత బెంగళూరులోని ధర్మారాయస్వామి ఆలయంలో శక్తిమాతకు పూజలు జరిపి నిర్వహించే కరగ ఉత్సవాల్లో ఈ సంవత్సరం టపాకాయలు కాల్చరాదని నిర్వాహకులు నిశ్చయించారు. అయితే ముందు దాదాపు లక్ష రూపాయల టపాసులు కాల్చాలని అనుకున్నా.. ఆలయ నిర్వాహకులు ఆ తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాదాపు 9 రోజులు జరిగే ఈ కరగ ఉత్సవాల్లో టపాసులు కాల్చడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం 500 ఏళ్ల నుండి ఉందని.. కానీ ఈసారి మాత్రం టపాసులు కాల్చకుండానే ఉత్సవాలు నిర్విహంచాలని చూస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.