కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు ... వచ్చారు అంతే !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వచ్చారు. మూడు రోజులు అనుకున్న  ‘పర్యటన’ ఆరు రోజులు సాగింది. సరే, ఎన్ని రోజులు అనేది పక్కన పెడితే, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్లారు? ఏమి చేశారు? అనే ప్రశ్నల కు సమాధానం లేదు. నూతన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్ళారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన రాష్ట్రపతిని కలవలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. అసలు అప్పాయింట్ మెంట్ అడిగారో లేదో కూడా తెలియదు. పోనీ ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లారా, అంటే అదీ లేదు. చీఫ్ సెక్రటరీ సహా అధికారులను వెంట పెట్టుకుని  ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానంలో వెళ్ళారు. ప్రత్యేక విమానంలో వచ్చారు.  

అదలా ఉంటే,ముఖ్యమంత్రి ఆరు రోజులు ఢిల్లీలో ఉన్నా ప్రధానమంత్రిని కాదు, కేంద్ర మంత్రులు ఎవరినీ కలవలేదు. మళ్ళీ ఇక్కడా అదే ప్రశ్న. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి ఇతర మంత్రుల అప్పాయింట్ మెంట్ అడిగారా, అడగలేదా, అడిగినా ఇవ్వలేదా అనేది బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది. ఇంకా చిత్రంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు సంబందించి అధికారులతో ముఖ్యమంత్రి ఢిల్లీలో సమీక్షలు నిర్వహించారని ‘లీక్’ లు వచ్చాయి. అలా వచ్చిన వార్తల్లో నిజముంటే అది మరీ చిత్రం. అంతే కాదు, కేంద్ర రాష్ట్ర  సంబంధాలకు సంబందించి, రాజకీయ నాయకత్వం మధ్య సంబంధాలు ఎప్పుడో  తెగిపోయాయి, ఇప్పడు అధికారుల మధ్య సంబంధాల విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని, రాష్ట్ర అధికారులను కేంద్ర అధికారులు దగ్గరకు కూడా రానీయడం లేదని అంటున్నారు.  

మరోవంక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రజాజీవితం అస్తవ్యస్థంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి,పరిస్థితిని సమీక్షించడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురుచున్న సమయంలో   ముఖ్యమంత్రి అందుబాటులో లేకుండా ఢిల్లీలో కులాసాగా కాలక్షేపం చేయడం, రోమ్  చక్రవర్తిని గుర్తుకు తెస్తోందని, విపక్షాలే కాదు, స్వపక్షం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.   అదలా ఉంటే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రాజకీయంగానూ ముందడుగు పడలేదని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు,జాతీయ రాజకీయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అచ్చిరాలేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్లి అన్ని రోజులున్నా, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తప్ప ఇంకెవరూ అయన్ని కలవలేదు. ఆయన ఇంకెవరినీ కలవలేదు. చివరకు, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా కాకున్నా కనీసం, కాంగ్రెస్ పార్టీ తరపున మరో నాయకుడు ఎవరూ, కేసేఆర్ ను కలవ లేదు. మద్దతు కోరలేదు.  

నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం అయితే, రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అయితే, కొంతమంది నాయకులు రహస్యంగా కలిసారని, వదంతులు ప్రచారం చేసినా, ఎవరూ నమ్మడం లేదని తెరాస నాయకులే వాపోతున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్, ఆర్జేడీ సహా మరికొందరు నాయకులకు ఫోన్ చేసినా ఫలితం లేక పోయిందని, ఎవరికి వారు ఏదో ఒక సాకు చెప్పి, ఇంకోసారి కలుద్దామని తప్పించుకున్నారని అంటున్నారు.  దీంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా బెడిసి కొట్టినట్లే అంటున్నారు.

ఒక విధంగా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర, కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా సాగిందని తెరాస నాయకులే అంటున్నారు. ఈ యాత్ర  వలన జాతీయ రాజకీయాల్లో ఆశించిన ప్రయోజనాలు దక్కకపోగా, రాష్ట్రంలోనూ వ్యతిరేక ప్రచారమే జరిగిందని అంటున్నారు. అందుకే, డ్యామేజి కంట్రోల్ లో భాగంగానే కావచ్చును ఢిల్లీ నుంచి వస్తూనే ముఖ్యమంత్రి దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహిస్తున్నరని, అయినా  ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని  తెరాస సీనియర్ నాయకులు అంటున్నారు. అయినా  కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో దేశం అంతటా నిర్వహిస్తున్నా కార్యక్రమాల్లో పాల్గొంటే, గౌరవంగా ఉంటుందని, అలాకాకుండా, ప్రత్యేకంగా కార్యక్రమాలు జరపడం, ఊరందరిదీ ఒక దారి అయితే, ఉలిపి కట్టెది వేరొక దారి  అన్నట్లు ఉంటుందని అంటున్నారు.