కేసీఆర్ అంటే జాతీయ నేతలు పరుగో పరుగు!
posted on Aug 1, 2022 10:46AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై ఎంతగా మక్కువ పెంచుకున్నారో అంత కంటే ఎక్కువగా జాతీయ స్థాయి రాజకీయ నేతలు ఆయన పట్ల అంతగా అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తరచూ జాతీయ రాజకీయ నేతలతో భేటీ అయ్యేందుకు ఆయన హస్తిన పర్యటనలకు వెళుతున్నా ఆయనను కలిసేందుకు మాత్రం పెద్దగా ఎవరూ మక్కువ చూపడం లేదు.
రాష్ట్ర పతి ఎన్నికల సందర్బంగా చివరి వరకూ తటస్థంగా ఉండి చివరి నిముషంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయన తరఫున ప్రచారం విషయంలోనూ అందరి కంటే తానే ఎక్కువ అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణలో యశ్వంత్ సిన్హా కటౌట్లు పెట్టడం దగ్గర నుంచి భారీ ర్యాలీ వరకూ చేయాల్సింది, చేయగలిగింది అంతా చేశారు. సరే రాష్ట్ర పతి ఎన్నిక అయిపోయింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాలు మార్గరెట్ ఆల్వాను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయి. ఆమె జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. మద్దతు కోరే విషయంలో కూడా తెరాస అధినేతను విపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగు రోజుల పాటు హస్తినలో మకాం వేసి మరీ తన జాతీయ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకోవాలని ప్రయత్నించినా కేసీఆర్ ను కలిసేందుకు ఎవరూ సుముఖత చూపలేదు. పెద్దగా పట్టించుకోనవసరం లేని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మాత్రమే కేసీఆర్ తో బేటీ అయ్యారు. తెరాస ఆ భేటీనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఆయన కాకుండా ఇతర పార్టీల నేతలెవరూ కేసీఆర్ తో భేటీ అయిన ధాఖలాలు లేవు. హస్తినలోనే ఉన్న కేసీఆర్ ను ఉప రాష్ట్రపతి ఎన్నికలో మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వమని కోరడానికైనా ఎవరైనా కలుస్తారని భావించిన టీఆర్ ఎస్ నాయుకులు అందుకు కూడా ఎవరూ రాకపోవడంతో డిజప్పాయింటయ్యారు. టీఆర్ఎస్ అధినేత రెండు మెట్లు దిగి మరీ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ఆందోళనలు చేపట్టినా, విపక్షాలతో రాసుకుపూసుకు తిరగడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆఖరికి ఆర్జేడీ కూడా కేసీఆర్ తో బేటీకి సుముఖంగా లేదని తేలిపోయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేసీఆర్ ను లైట్ తీసుకుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సానుకూలంగా సాగడంలేదు. దీనికి తోడు యాంటి సెంటిమెంట్ కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీకి ప్రతిబంధకంగా తయారైంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందనీ అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా కాలం కలిసి రాకపోతే.. అన్నట్లు ఉంది. జాతీయ రాజకీయాలంటూ ఆయన ఎంత హడావుడి చేసినా పెద్దగా మద్దతు రావడం లేదన్నది పక్కన పెడితే.. ఆయనతో రాజకీయంగా సన్నిహితంగా వచ్చిన వారందరికీ ఏదో రూపంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ (పీకే) నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వరకూ అందరూ ఏదో విధంగా ఇబ్బందులు పడ్డవారే. సినిమా పరిశ్రమ తరువాత సెంటిమెంట్లను ఎక్కవగా నమ్మేది రాజకీయ రంగంలోనే అంటుంటారు. అంతెందుకు స్వయంగా తెరాసయే సెంటిమెంట్ అస్త్రాన్నే రాజకీయ సోపానంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత మరో సారి తెరాసను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సెంటిమెంటునే ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం వద్దకు వచ్చే సరికి అన్నీ యాంటీ సెంటిమెంట్ ఉదంతాలే ఎదురౌతున్నాయి.
గత రెండు ఎన్నికలనూ టీఆర్ఎస్ సొంత బలంతో ఎదుర్కొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన, పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచార సారథ్యం వరకూ అన్ని కేసీఆర్ తన భుజస్కంధాలపై మోశారు. ఒంటి చేత్తో పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడానికి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను ఆశ్రయించారు. పీకే కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు మార్లు కేసీఆర్ తో ప్రగతి భవన్ లోభేటీ అయ్యారు. అక్కడే మకాం వేసి మరీ చర్చలు జరిపారు. అక్కడి వరకూ బానే ఉంది. ఆ తరువాతే వ్యూహకర్తకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. పీకే రాజకీయ ఆకాంక్షలకు గండి పడింది. ఏదో ఓపార్టీ పంచన చేరి రాజకీయంగా చక్రం తిప్పుదామనుకున్నా ఆయన చేరదీసే వారూ, దగ్గరకు రానిచ్చే వారే కరవయ్యారు. తెలుగు రాష్ట్రాలు తప్ప ఎన్నికల వ్యూహాల కోసం పీకే వైపు చూసే వారే కరవయ్యారు. ఏ పార్టీ దరికి చేరనీయకపోవడంతో అని వార్యంగా సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రకటన చేసి.. అక్కడకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది.
ఆ తరువాత వంతు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్. రాకేశ్ టికాయత్ పరిస్థితి కూడా కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే అగమ్యగోచరంగా మారిపోయింది. మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన బ్రహ్మాండమైన ఆందోళనకు నాయకత్వం వహించిన టీకాయత్.. ఆ ఆందోళనకు మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ తరువాత కూడా ఆయన రైతు నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్నే అనుభవించారు. హైదరాబాద్ వచ్చి మరీ రైతు సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల నిప్పులు చెరిగారు. అక్కడి వరకూ ఆయనకు తిరుగేలేని పరిస్థితి ఎదురైంది. ఆ తరువాతే ఆయన సీఎం కేసీఆర్ తో హస్తినలో వేదిక పంచుకున్నారు. అక్కడ నుంచీ ఆయన కష్టాలు మొదలయ్యాయి.
కేసీఆర్ తో జత కట్టిన తరువాతే ఆయనకు అంత వరకూ సహచరులుగా ఉన్న రైతు నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయనపై దాడికి సైతం దిగారు. దీంతో ఇప్పుడు ఆయన వెంట రైతులు లేని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ వెంట తిరుగుతున్న పరిస్థితి. దేశంలో రైతుల పరిస్థితి, కేంద్రానికి వ్యతిరేకంగా వారికి మరోసారి ఉద్యమ కార్యోన్ముఖులను చేయడం తదితర అంశాలపై ఇటీవల ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు రోజులు బస చేసి మరీ ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు తికాయత్ కు కేసీఆర్ వెంట నడవడం వినా మరో మార్గం కనిపించడం లేదా అని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.
ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా కేసీఆర్ బీజేపీయేతర కూటమి, జాతీయ స్థాయిలో మరో పార్టీ ప్రతిపాదనలకు ఇసుమంతైనా స్పందించని సమయంలో కేసీఆర్ తో కలిసి అడుగు వేయడానికి ముందుకు వచ్చారు హేమంత్ సొరేన్. హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ తో రెండు రోజులు మంతనాలు జరిపారు. పనిలో పనిగా తన సన్నిహిత బంధువు వైద్యం కోసం కూడా కేసీఆర్ సలహాను, సహాయాన్ని అందుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో కలిసి అడుగులు వేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. అంత వరకూ బానే ఉంది. ఆ తరువాతే పరిస్థితి ఆయనకు ప్రతి కూలంగా మారింది. మైనింగ్ లీజు, అలాగే ఒక ప్లాట్ ఆయన భార్యపేరున రిజిష్టర్ చేయించుకున్నారన్న అవినీతి ఆరోపణలపై ఆయన నివాసం, ఆయన సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జరిగాయి.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ సన్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా సంబంధించిన నివాసాలపై దాడులు నిర్వహించింది. అలాగూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇళ్లల్లో సైతం ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం18 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన తరువాత జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ తో రాజకీయంగా ఎలాంటి సాన్నిహిత్యమైనా తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న ఆందోళన రాజకీయ నాయకులలో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే ఒకరి తరువాత ఒకరుగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయమే అయినా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ రంగంలో ఇది కేసీఆర్ ను ఏకాకిగా మార్చే అవకాశాలే మిక్కిలిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.