గత ప్రభుత్వాల తప్పులు.. చంద్రబాబుపై నిందలు
posted on Jan 10, 2025 6:03AM
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. రాష్ట్రం అభివృద్ధికోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించే నాయకులపైనే విమర్శలు, నిందలు ఎక్కువ. ఈ కోవలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడూ తపన పడుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్ద పీట వేసి తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని యువత ప్రపంచ దేశాల్లో సత్తాచాటేందుకు చంద్రబాబు కారణమయ్యారు. ఇక ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అధికారుల్లో హడలే. ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. సమర్ధత కలిగిన అధికారులకు పెద్దపీట వేస్తూ అన్నివిభాగాల్లోనూ పాలన సాఫీగా జరిగేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. అందుకే పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతలు చంద్రబాబు వద్ద పాలన ఎలా చేయాలో, అధికార యంత్రాంగంతో ఎలా పనిచేయించుకోవాలో నేర్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
అయితే, చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని గాడిలోపెట్టి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తే.. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ రాష్ట్రంలో పాలనను చిందరవందర చేయడం పరిపాటిగా మారింది. మళ్లీ ప్రజలు చంద్రబాబును సీఎం చేయడం ఆయన అధికారంలోకి వచ్చిపాలన గాడిలో పెట్టడం, రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడం పరిపాటిగా మారింది. అయితే గత ప్రభుత్వ అరాచక పాలన కారణంగా అస్తవ్యస్థమైన రాష్ట్రాన్ని, నిర్వీర్యమైన వ్యవస్థలను దారిలోకి తేవడానికి దాదాపు ఏడాది సమయం పడుతూ వచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ హయాంలో ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారుల పెత్తనం సాగింది. వారికి ఇష్టమొచ్చిన వారికి ప్రమోషన్లు ఇచ్చి సమర్ధత కలిగిన అధికారులను పక్కన పెడతూ ప్రజా సంపదను లూటీ చేయడం అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలోనూ పరిస్థితి మార్చడానికి వారు చేసిందేమీ లేదు. పదవి కాపాడుకోవడానికే వారికి ఉన్న సమయం చాలలేదు. ఈ క్రమంలో వైఎస్ హయాంలో నిబంధనలు తుంగలోతొక్కి ఏలిన వారి మెప్పు కోసమే తమ అధికారం అన్నట్లు పి చేసి పలువురు అధికారులు జైళ్లకు సైతం వెళ్లారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వైఎస్ హయాంలో అవినీతి, అక్రమాలతో గాడితప్పిన అధికార యంత్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబుకు సంవత్సరంపైగానే పట్టింది. ఈ సమయంలోనే సమర్ధత లేని అధికారుల వల్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. 2015 జులై 15న గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమర్ధతలేని, పనిపై శ్రద్దలేని అధికారుల తప్పిదాల కారణంగా ఆ విషాధ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం చంద్రబాబుపై నిందలు మోపారు. దీంతో ఈ ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ విచారణ చేపట్టింది. సుదీర్ఝ విచారణ తర్వాత నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ పేర్కొంది. రాజకీయ లబ్ది కోసమే చాలా మంది సీఎంపై ఆరోపణలు చేసినట్లు ఆ నివేదికలో తెలిపింది. పుష్కర ముహుర్తంపై అనవసర ప్రచారం వల్లే జనం రద్దీ పెరిగిందని నివేదికలో తెలిపింది. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ సహా అన్ని వీడియోలను కమిషన్ పరిశీలించింది. అధికారంలో లేని పార్టీలు రాజకీయ శత్రుత్వంతోనే ప్రతీ అంశాన్ని విమర్శల్ని వాడుకోవడాన్ని కమిషన్ పేర్కొంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తరువాత పాలన గాడిలో పడటంతో ఎలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోలేదు.పాలన సజావుగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే నంబర్ వన్ గా వరుసగా నాలుగు సంవత్సరాలు నిలిచింది.
ఇక ప్రస్తుతానికి వస్తే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం వల్ల జరిగిందే. గత వైసీపీ హయాంలో పాలన పూర్తిగా గాడితప్పింది. అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. జగన్ మోహన్ రెడ్డి తనకు నచ్చిన అధికారులకు సమర్ధత లేకపోయినా ఉన్నతస్థాయి పదవులను కట్టబెట్టారు. ముఖ్యంగా పోలీస్ శాఖలోని చాలా మంది ఐపీఎస్ స్థాయి నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై, ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించిన ఘటనలు కోకొల్లలు. దీంతో పోలీస్ శాఖ అంటేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. సమర్ధత కలిగిన అధికారులను ప్రోత్సహించి మెరుగైన పాలన ఎలా అందించాలో తెలియని జగన్ మోహన్ రెడ్డి.. అవినీతి, అక్రమాలకు తోడు.. అక్రమ అరెస్టులతో ఐదేళ్లు పాలన సాగించారు. దీంతో 2024లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎప్పటిలాగానే పాలనను గాడిలో పెట్టడానికే ఆయన సమయం సరిపోతున్నది. గాడితప్పిన అధికారులను సక్రమ మార్గంలో నడిపించి మెరుగైన పాలనను ప్రజలకు అందించేందుకు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. అ అవినీతి అధికారులను, వైసీపీకి కొమ్ముకాసిన అధికారులు కొందరిని పక్కన పెట్టినప్పటికీ.. ఇంకా చాలా మంది అధికారులు ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయడం కోసమే చేసేందుకు అని గ్రహించలేక పోతున్నారు. అటువంటి కొందరు అధికారుల తీరు, నిర్లక్ష్యం కారణంగానే తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది.
వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణిచారు.. పదుల సంఖ్యలో గాయపడగా.. వారంతా స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది. ఐదేళ్లు అధికారులను వైసీపీ కార్యకర్తల్లా వాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు గుర్తించక పోవటం నిజంగానే సిగ్గుచేటు. ఐదేళ్లు రాష్ట్రాన్ని గాలికొదిలేసి జగన్, వైసీపీ నేతలు తమ ఆస్తులను పెంచుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో అధిక శాతం మంది అధికారులు సైతం తమ ఆస్తులను పెంచుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. తద్వారా పనిలో శ్రద్ద లోపించింది. ప్రజలకు మనం సేవకులం అనే విషయాన్ని చాలామంది అధికారులు మర్చిపోయారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత శాఖల వారిగా సమావేశాలు పెడుతూ గత వైసీపీ పాలనతో ఛిన్నాబిన్నమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఆర్నెళ్లు ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే, ఇక్కడ ఇబ్బందికర విషయం ఏమిటంటే.. నిత్యం ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటూ పనిచేస్తూ, అధికారులతో పనిచేయించే చంద్రబాబు.. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. అంతకుముందున్న ప్రభుత్వాల్లో దెబ్బతిన్న వ్యవస్థలను. గాడితప్పిన అధికార యంత్రాంగాన్ని సక్రమ మార్గంలోకి తెచ్చేందుకు ఏడాది సమయం పడుతుండటం విశేషం. ఆ గత ప్రభుత్వాల తప్పిదాల కారణంగా చోటు చేసుకున్న సంఘటలను చూపుతూ.. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణమైన నేతలే చంద్రబాబుపై విమర్శలు చేయడం, నిందలు మోపడం దారుణం.