అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు..

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉందన్నారు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజన్నారు. ఈ చట్టం ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదు. వీఆర్వోలను స్కేల్‌ ఎంప్లాయిస్‌గా మార్చుతామని కేసీఆర్ తెలిపారు.

 

పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. "ధరణి పోర్టల్‌ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ వివరాలు ధరణిలో ఉంటాయి. ప్రపంచంలో ఏమూలనైనా ధరణిని ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తాం. ఇకపై ఎవరూ పక్కవారి ఇంచు భూమి కూడా ఆక్రమించుకోలేరు. వ్యవసాయ భూములనే ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. నాన్‌ అగ్రికల్చర్‌ భూములను సబ్‌ రిజిస్ట్రార్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల పదవుల రద్దు చట్టం- 2020 పేరుతో సీఎం కేసీఆర్ బిల్లును ప్రవేశపెట్టారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి. వీఆర్వోలను ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమానమైన శ్రేణిలోకి బదిలీ లేదా విలీనం చేయనున్నారు.