ఆశల పల్లకిలో కేసీఆర్!

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.  

లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు. 

ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.