చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి.. బలంగా పుంజుకున్న కళా వెంకటరావు!

మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు.

ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ

డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.