జగన్మాయ కోసం కేసీఆర్ అర్రులు.. అవినీతి కేసుల బెడద నుంచి బైట పడేయమంటూ వేడుకోలు

జగన్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతకు ఆపద్భాంధవుడిగా మారిపోయారా? జగన్ సహాయం కోసం కేసీఆర్ అర్రులు చాస్తున్నారా? జగన్ దావోస్ పర్యటనలో ఆకస్మిక బ్రేక్ తీసుకుని లండన్ లో ల్యాండ్ అవడానికి కారణం కేసీఆర్ కు తన వంతు సహాయం చేయడానికేనా, అందులో భాగంగానే  కేసీఆర్  తనయుడు కేటీఆర్ తో భేటీ అయ్యారా?  అన్న ప్రశ్నలకు అత్యున్నత స్థాయి అధికారుల నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇంతకీ అసలు కథేమిటంటే..

ఇటీవలి కాలంలో కేసీఆర్ అవినీతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో కేసీఆర్ అరెస్టు కావడం తథ్యం అంటూ ఆయన చెబుతున్నది వట్టి ‘సోది’ కాదని కేసీఆర్ అవినీతి, అక్రమ సంపాదనపై ఈడీ, సీబీఐలు నజర్ పెట్టాయనీ అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారాన్ని కేసీఆర్ కు లీక్ చేసింది కూడా కేంద్రంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులేననీ కూడా అంటున్నారు.  దీంతో ఈడీ సోదాల నుంచీ, సీబీఐ దర్యాప్తు నుంచీ తప్పించుకోవడానికి ఏం చేయాలన్న యోచనలో కేసీఆర్ కు జగన్ ఆపద్బాంధవుడిగా కనిపించారని అంటున్నారు.

ఎందుకంటే జగన్ కూడా అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు.ఈడీ దర్యాప్తునూ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాల నుంచి, సీబీఐ దర్యాప్తు నుంచి బయటపడటమెలా అన్న విషయంలో జగన్ సహాయ సహకారాలను కేసీఆర్ కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన జగన్ గత ఎన్నికలలో తన విజయానికి అన్ని విధాలుగా సహాయపడిన తన రాజకీయ స్నేహితుడిని ఆదుకోవడానికి తన అధికారిక విదేశీ పర్యటనలో అనధికార మార్పులు చేసుకుని మరీ లండన్ లో ల్యాండ్ అయ్యారనీ, అక్కడ ఈ విషయాలపై కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో సమావేశమై, ఈడీ, సీబీఐ ల నజర్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై సూచనలూ సలహాలూ ఇచ్చారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే జగన్, కేసీఆర్ రహస్య బంధం ఇక్కడితో ఆగిపోదనీ, అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు కేంద్రం పెద్దలను ఆశ్రయించి ఊరట పొందేందుకు కూడా కేసీఆర్ జగన్ సహాయం కోరారనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఎంటర్ టైన్ చేసే పరిస్థితి లేకపోవడం, తన ఢిల్లీ టూర్ లోకేసీఆర్ కేంద్ర  హోంమంత్రి అప్పాయింట్ కోరినా ఆయన ఇవ్వకపోవడంతో కేసీఆర్ జగన్ ను  ఆశ్రయించడంతో ఆయన బీజేపీలోని తనకు అనుకూల వర్గాల ద్వారా కేసీఆర్ ను ఈ ఇబ్బంది నుంచి బయటపడేసేందుకు అంగీకరించి ఆ దిశగా కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకువెళ్లేలా ఆర్థక ఉగ్రవాదానికి పాల్పడుతున్నా, చిన్నపాటి మందలింపులతో సరిపెట్టేసి రాష్ట్రానికి రుణ సహకారం అందిస్తున్న కేంద్రం, తెలంగాణ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ అప్పుల విషయంలో తిప్పలు పెడుతోంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఆర్థిక విధానాలు నిబంధనలను దాదాపు కచ్చితంగా పాటిస్తున్నా..

ఏవో కొర్రీలతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి దగ్గర కావాలన్నా... అవినీతి ఆరోపణలపై విచారణనుంచి తప్పించుకోవాలన్నా జగన్ ను ఆశ్రయించడమే మార్గమని నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడలో భాగమే లండన్ వేదికగా జగన్ తో కేటీఆర్ భేటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.