తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరు.. అన్ని పార్టీల తలుపులూ బార్లా

తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెరుగుతోంది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మూడూ కూడా తలుపులు బార్లా తెరిచేశాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ అధికార టీఆర్ఎస్ ను బాగా దెబ్బకొట్టేటట్టు ఉంది. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో మిగిలిన పార్టీలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఇతర పార్టీల నాయకులకు టీఆర్ఎస్ తలుపులు తెరిచేశారు.

ఇతర పార్టీల టికెట్లతో గెలిచిన వారు కూడా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని తెరాస తీర్థం పుచ్చేసుకున్నారు. అంతేనా ఏకంగా చట్టసభల్లో ఇతర పార్టీల సభ్యులను గంపగుత్తగా తెరాసలో చేర్చుకుని అసెంబ్లీలో, మండలిలో ఆ పార్టీల ఉనికే లేకుండా చేసిన చరిత్ర టీఆర్ఎస్ ది. అయితే ఇప్పుడు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్ లో పదవులు దక్కడం వల్ల తొలి నుంచీ ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న వారిలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు బలోపేతం అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ అసంతృప్తులు ఆ పార్టీల వైపు చూస్తున్నారు.

ఇదే అదునుగా ఆ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తలుపులు తెరిచేశాయి. టీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లభించడం లేదు, తగిన స్థానం లేదు అన్న అసంతృప్తితో ఉన్న వారికి గాలం వేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నుంచి వలసలు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు. అదే దారిలో పలువురు ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అలాగే బీజేపీ కూడా టీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయని చెబుతోంది. పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.  

ఇలా ఉండగా హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతల సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న కొద్దీ రాజకీయ వలసలు జోరందుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా ఇంత కాలం టీఆర్ఎస్ లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇప్పుడు రాజుకుని ఇతర పార్టల ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.