వైసీపీ నేతల రక్షణే ఏపీ పోలీసు డ్యూటీయా?.. ఎమ్మెల్సీపై చర్యలకు ఎందుకు వెనుకంజ?!

వైపీపీ నేతల కోసం పోలీసులు న్యాయ సూత్రాలనే మార్చేస్తున్నారా? వారి రక్షణ కోసం ప్రత్యేక రూల్స్ రూపొందించుకున్నారా? అంటే ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ విషయంలో పోలీసుల తీరు చూస్తుంటే ఔననే చెప్పాల్సి వస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను రక్షించడమే లక్ష్యంగా పోలీసులు కొత్త కొత్త రూల్స్ చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంఅనుమానాస్పద మృతి విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు.  ఒక వైపు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని చెబుతున్న పోలీసులు కనీసం ఆయనపై కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పోలీసులు పరారీలో ఉన్నారంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం దర్జాగా బహిరంగంగా తిరుగుతున్నారు. రాజవొమ్మంగిలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన పేరు మీద  ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. అలాగే ఒక వైపు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతుంటే.. గురువారం రాత్రి రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. 
అర్ధరాత్రి సుబ్రహ్మణ్యాన్ని తీసుకు వెళ్లి, తెల్లారి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ మృతదేహాన్ని తన కారులోనే తీసుకువచ్చి, మృతుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించేసరికి కారును సైతం  వదిలేసి పారిపోయిన ఎమ్మెల్సీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

మరో వైపు పోలీసులు ఎమ్మెల్సీ చెప్పినట్లుగా  ఆయన చెప్పిన ప్రాంతంలో ఎలాంటి యాక్సిడెంటూ  జరగలేదని స్పష్టం చేస్తూనే, సుబ్రహ్మణ్యం మృతికి కారణం తెలియాలంటే మృతదేహానికి పోస్టు మార్టం జరిగి నివేదిక రావాలని  చెబుతున్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే తప్ప ఎలాంటి కేసూ నమోదు చేయలేమంటున్నారు.  

అయితే బాధితులు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీయే హత్య చేశాడని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తుంటే కూడా ఎమ్మెల్సీపై కేసు కూడా నమోదు చేయకపోవడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలకేమన్నా ప్రత్యేక రక్షణ కవచం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా కళ్లముందే తిరుగుతున్నా పరారీలో ఉన్నాడంటూ పోలీసులు చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.