వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ 10 వేల సాయం.. కేసీఆర్ ప్రకటన

వరద ముంపు బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సాయం ప్రకటించారు. హైదరాబాద్‌ లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. 

 

హైదరాబాదులో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసిందని అన్నారు. బస్తీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాదులో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.1 లక్ష ఇవ్వనున్నట్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున సాయం చేయనున్నట్లు ప్రకటించారు. 

 

దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామన్నారు. మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. పేదలకు సాయం అదించడం కోసం మున్సిపల్‌ శాఖకు రూ.550 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.సీఎం రీలీఫ్ ఫండ్ కు విరివిగా విరాళాలు అందించాలని కేసీఆర్ కోరారు.

 

కాగా, వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరద సాయంగా రూ.10 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర సీఎం కె. పళనిసామి ఓ లేఖ రాశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ప్రజల తరఫున తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్టు లేఖలో తెలిపారు.