లోకేష్ పర్యటనతో సర్కార్ షేక్! వరదలపై సీఎం ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పదేండ్ల తర్వాత కుండపోత వానలు కురవడంతో భారీగా నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు నేలకూలయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు నరకం చూశారు. మోకాళ్ల లోతు వరదలోనే కొన్ని కాలనీలు రెండు మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణమ్మ ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాలన్ని జలమలమయ్యాయి. దివిసిమ నీట మునిగింది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. 

 

వరద నివారణ చర్యల్లో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వరదలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన జగన్ సర్కార్.. వరద బాధితులను ఆదుకోవడంలోనూ చేతులెత్తేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం బాధితులు కేకలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల జాడే లేకుండా పోయింది. వరదల సమయంలో అధికార పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర విమర్శలువస్తున్నాయి. వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నా వైసీపీ నేతలు స్పందించకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపైనా ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

 

వరద బాధితులు కష్టాల్లో ఉన్నా అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోగా.. టీడీపీ మాత్రం బాధితులకు బాసటగా నిలిచింది. యువనేత నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఇచ్చారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. మోకాళ్ల లోతు నీటిలోనూ నడుచుకుంటూ బాధితుల దగ్గరకు వెళ్లి .. వారి సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు. మూడు రోజుల క్రితం గుంటూరు, కృష్ణా జిల్లాలోని  వరద బాధితులను పరామర్శించారు. మంగళగిరి.  తాడేపల్లి నియోజకవర్గంలో తిరిగి కృష్ణానది వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన  రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోనూ  పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చారు నారా లోకేశ్.  

 

నారా లోకేష్ రాకతో వరద బాధితులకు  ధైర్యం వచ్చింది. అధికార పార్టీ నేతలు తమను పట్టించుకోలేదని లోకేష్ కు వారు చెప్పుకున్నారు. లోకేష్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ఆయన్ను కలిసేందుకు రైతులు, ప్రజలు ఎగబడ్డారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. వరద బాధితుల సమస్యలు విన్న లోకేష్.. రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతు నీళ్ళల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆకాశంలో విహరిస్తున్నారని మండిపడ్డారు.గత  ఏడాది నష్టపోయిన రైతులకు ఇంకా నష్ట పరిహారం అందలేదని లోకేష్ విమర్శించారు. ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా కూడా జరగడం లేదని చెప్పారు. రైతుల కోసం టీడీపీ పోరాడుతుందని,  చిట్ట చివరి రైతుకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

 

వరద ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన అధికార వైసీపీని షేక్ చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు పెరగడం, నారా లోకేష్ విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో దిద్దుబాట చర్యలకు దిగింది జగన్ సర్కార్. హడావుడిగా వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం జగన్. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద తీరును ఆయన పరిశీలించారు. అధికారులతో వరద నష్టంపై సమీక్ష చేశారు. వరద ప్రాంతాల్లో లోకేష్ పర్యటన వల్లే జగన్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందనే చర్చ జనాల్లో జరుగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో తమకు డ్యామేజీ జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. వరదల  సమయంలో తమ పార్టీ నేతల తీరు చాలా దారుణంగా ఉందని కొందరు నేతలు ఓపెన్ గానే ఆరోపిస్తున్నారట.

 

మొత్తంగా వరద బాధితులను ఆదుకోవడంలో మొద్దునిద్రలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని కదిలించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆయన చేసిన ఆరోపణలు సర్కార్ కు సూటిగా తగిలాయంటున్నారు. అందుకే వరదలు వస్తున్నా అధికారులతో సమీక్షలు పెట్టని సీఎం జగన్ .. హడావుడిగా ఏరియల్ సర్వే చేశారంటున్నారు. వరద ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన, ఆయన చేసిన ప్రసంగాలు టీడీపీకి మైలేజీ ఇస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.