చిత్తూరు మేయర్ పదవి ఎవరికి దక్కెనో?
posted on Nov 24, 2015 2:22PM
చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ గురించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అనురాధ హత్య నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరు మేయర్ గా ఎవరికి అవకాశం దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మేయర్ పదవి బీసీ కోటాలో రిజర్వ్ అయి ఉంది. కానీ అనురాధ భర్త మోహన్ ఓసీ వర్గానికి చెందిన వాడు.. ఈ నేపథ్యంలో అనురాధ తండ్రి బీసీ వర్గానికి చెందిన వాడు కావడంతో అది పరిగణలోకి తీసుకొని అనురాధకి మేయర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అనురాధ మరణానంతరం.. తన కోడలకి లేదా తన కూతురికో మేయర్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే అనురాధ కోడలు కూడా ఓసీ వర్గానికి చెందినదే.. దీంతో ఈమెకు మేయర్ పదవి వస్తుందో రాదో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మేయర్ పదవికి పలు బీసి మహిళా కార్పొరేటర్లు కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 8 మంది టీడీపీ మహిళా కార్పొరేటర్లు ఉండగా వారు కూడా మేయర్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టు.. దీనిలోభాగంగానే అనురాధ కుటుంబం తరుపున ఎవరి పేరును ఖరారు చేయని నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎలాగూ నిర్ణయం చంద్రబాబుదే కాబట్టి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.