కార్తీక మాసం ఎందుకంత విశిష్టమైనది!
posted on Nov 13, 2023 10:03AM
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ఉన్న 12మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఆశ్వయుజ మాస అమావాస్య నాడు వచ్చే దీపావళి మరుసటిరోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది. ఇది తెలుగు క్యాలెండర్ లో ఎెనిమిదవ నెల. కార్తీకమాసంలో చాలామంది శివాలయ దర్శనం, దీపాలు వెలిగించడం, దైవభక్తిలో గడపడం చేస్తారు. అయితే కార్తీకమాసంలో కేవలం ఇవే ప్రధానం కాదు. కార్తీకమాసం ఎందుకంత గొప్పది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? పురాణాలలో కార్తీకమాసం గురించి ఏం చెప్పబడింది? కార్తీకమాసంలో ఏ పూజ మంచిది? వివరంగా తెలుసుకుంటే..
హిందూ క్యాలెండర్ లో కార్తీకమాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం అంతా స్నానం, దానం, ధ్యానం, పూజలు మొదలైనవాటితో చాలా భక్తిపూర్వకంగా గడిచిపోతుంది. ఈ మాసం పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తూ ఆ విష్టు భవనానుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని బ్రహ్మ దేవుడు కూడా చెప్పినట్టు పురాణ కథలున్నాయి. ఇకపోతే కార్తీకమాసంలో ఎవరైనా తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటే దానికి నారాయణ తీర్థం లేదా బదరికాశ్రమం చాలా ఉత్తమమైనదని పండితులు, పురాణ కథనాలు చెబుతున్నాయి.
కార్తీక మాసం గురించి పురాణ గ్రంథాలలో ..
"న కార్తీకసమో మాసో న కృతేన్ సమం యుగం
న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం" అని ఉంది.
అంటే.. కార్తీకమాసం లాంటి మాసం లేదు, సత్యయుగం లాంటి శకం లేదు, వేదాల వంటి గ్రంథాలు లేవు, గంగ వంటి తీర్థం లేదు అని అర్థం. కార్తీక మాసంలో దేవుడి అంశ బలపడుతుంది. ఈ మాసంలో విష్టుభగవానుడిని తులసితో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ మాసంలో జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కేవలం ఈ పూజలు మాత్రమే కాకుండా గంగాస్నానం, దీపదానం, యజ్ఞం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.
నదీ స్నానం.. దీపాలు వదలడం వెనుక కారణం..
కార్తీక మాసంలో స్నానానికి పెద్ద పీట వేస్తారు. పారే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అయితే నదీ స్నానం వెనుక ఉన్న ముఖ్య కారణం చూస్తే..
"శ్రేష్ఠో దేవాన మధుసూదన్
తీర్థ నారాయణాఖ్యాం హి త్రితాయాం దుర్లభం కలౌ ।" అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం శ్రీమహావిష్ణువు నెలకొని ఉండే విష్టుతీర్థం లాగా కార్తీకమాసం కూడా గొప్పది అని అర్థం.
ఇంకొక కారణం చూస్తే.. కార్తీక పూర్ణిమ రోజున మహదేవుడు లేదా పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విష్ణుమూర్తి కూడా మత్స్య అవతారం ఎత్తాడు. కార్తీకమాసం అంతా విష్ణువు మత్స్య అవతారంలో నీటిలో నివసిస్తాడు. అలాంటి పవిత్రమైన సమయంలో ఉదయాన్నే నీటిలో స్నానం చేయడం, నీటిలో దీపాలు వదిలడం చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో గంగాస్నానం చేయడానికి దేవతలే భూలోకానికి వస్తారని కూడా అంటారు. అందుకే పారే నీటిలో స్నానం చేయడం పుణ్యప్రదం.
*నిశ్శబ్ద.