సమర్థతకు-అసమర్థతకు మధ్య ఉపఎన్నికలు
posted on Apr 25, 2011 10:25AM
తాడిపత్రి: ఉప ఎన్నికలు
నీతికి-అవినీతికి , సమర్థతకు-అసమర్థతకు మధ్య జరుగుతున్నాయన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లాలో ప్రచారానికి వెళ్తూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులను తరలించి పాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడుందో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రగతి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు డబ్బు వెదజల్లుతున్నాయన్నారు. ఒంటరి వాడినని జగన్ చెప్పుకుంటున్నాడని, కానీ జగన్ వద్ద లక్షల కోట్లు ఉన్నాయన్నారు. కడపలో వైఎస్సార్ ఫ్యాక్షన్‌ను పెంచిపోషించారని ఆరోపించారు. మొన్నటి వరకు సూట్‌కేసుల్లో బాంబులు ఉండేవని, నేడు డబ్బులు వస్తున్నాయన్నారు. అధికార వ్యామోహం, సిఎం కావాలనే ఆలోచనతోనే జగన్ నీచ రాజకీయాలకు నడుంకట్టారన్నారు.
యుపిఎ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచిపోషిస్తోందని చంద్రబాబుఆరోపించారు. అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. దేశం నుండి వేల కోట్ల నల్లధనం విదేశాలకు తరలించడం సిగ్గుచేటన్నారు. అవినీతిపై అన్నాహజారే చేపట్టిన పోరులో భాగంగా ఆరోపణలను నిరూపించుకునేందుకు సిద్ధమా అని ప్రశ్నించిన నేపధ్యంలో అధికార పార్టీ మిన్నకుండి పోయిందన్నారు. అవినీతిపై ఉద్యమం చేస్తే సహకరించాల్సింది పోయి వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అరికట్టక పోతే పేదవాడు మరింత పేదవాడుగా మిగులుతాడన్నారు. అకాల వర్షాలతో లక్షల ఎకరాల పంట దెబ్బతినిందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వరి పండించే రైతుకు అన్యాయం జరుగుతోందని, వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.