క్యాన్సర్ బాధిత చిన్నారి శ్రీనిధికి జూ.ఎన్టీఆర్ పరామర్శ

 

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన పదేళ్ళ శ్రీనిధికి బ్లడ్‌క్యాన్సర్‌ సోకడంతో ఆమె తల్లి తండ్రులు పాప ప్రాణాలు దక్కించుకోవడం కోసం అనేక పెద్ద పెద్ద ఆసుపత్రులు చుట్టూ తిరిగారు. కానీ ఆమె వ్యాధి నయం కాదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఆమెను కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆ పాపకు చిన్నప్పటి నుండి జూ.ఎన్టీఆర్ అన్నా అతని డ్యాన్సులు అన్నా చాలా ఇష్టం. ఎప్పటికయినా జూ.ఎన్టీఆర్ తో కలిసి ఫోటో తీయించుకోవాలనేది ఆ పాప కోరిక. అయితే తనకు భయంకరమయిన క్యాన్సర్ వ్యాధి కబళించబోతోందనే సంగతి తెలియకుండా ఆ పాప తల్లితండ్రులు ఇంతవరకు దాచిపెట్టారు. ఆ పాప (చివరి) కోరిక గురించి తెలుసుకొన్న జూ.ఎన్టీఆర్ ఈరోజు ఆ పాప పుట్టినరోజు కావడంతో బహుమతులు తీసుకొని పాపను చూసేందుకు నేరుగా ఆస్పత్రికి వచ్చారు. పాపతో కొద్ది సేపు గడిపి, ఆమెతో కలిసి ఫోటోలు తీయించుకొన్నారు. దానితో ఆ పాప ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మళ్ళీ త్వరలోనే మరో మారు వచ్చి కలుస్తానని ప్రామిస్ చేసి వెళ్లిపోయారు. తన చిన్నారి అభిమాని వైద్యం కోసం వీలయినంత ఆర్ధిక సహాయం చేస్తానని ఆయన పాప తల్లి తండ్రులకు హామీ ఇచ్చేరు.