గమనిక: జయప్రదకు రాజమండ్రి టికెట్ కావలెను

 

అలనాటి అందాల నటి, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ యంపీ జయప్రద సమాజ్ వాది పార్టీతో తెగ తెంపులు చేసుకొని బయటపడిన తరువాత మళ్ళీ పుట్టింటి వైపు మనసు మళ్ళడంతో రాష్ట్రానికి తిరిగివచ్చారు. అయితే ఆమె వచ్చి ఏడాది అవుతున్నపటికీ ఇంకా ఏ పార్టీలోను చేరలేదు, కానీ ఇక రాష్ట్ర రాజకీయాలలో దూకేయడం మాత్రం ఖాయం అని ఆమె నాటి నుండి నేటి వరకు చెపుతున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ నుండి కూడా ఆమెకు ఆహ్వానం వచ్చినట్లు కనబడలేదు. అయినప్పటికీ, ఆమె తానూ రాజమండ్రీ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు మాత్రం ప్రకటించేశారు.

 

అంటే తనని పార్టీలో చేర్చుకోదలచిన వారికి ఆమె ముందుగానే రెండు షరతులు పెట్టినట్లు భావించాలి. పార్టీలో చేరాలంటే టికెట్ ఈయడం, అది కూడా రాజమండ్రీ టికెట్ అయి ఉండాలి. అసలు ఆమెను ఏ పార్టీ ఆహ్వానించనప్పుడు, ఇక టికెట్ ప్రసక్తి ఎందుకు? ఇప్పటికే, అన్ని పార్టీలలో ఏళ్ల తరబడి చేస్తున్న సీనియర్లు, ఆ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వారు చాలా మంది ఉండగా, హట్టాతుగా ఊడిపడిన ఆమెకు టికెట్, అది కోరుకొన్న చోటి నుండే ఎవరు ఇస్తారు? అని ఆమె ఆలోచించారో లేదో తెలియదు కానీ, తన రెండు షరతుల వలన ఆమెకు ఏ పార్టీలోకి ప్రవేశించే అవకాశాలు లేకుండా చేసుకొన్నారు.

 

కానీ, ఆమె ఒకనాడు తనతో కలిసి సినిమాలలో నటించిన చిరంజీవి అభయ ‘హస్తం’ అందుకొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా కలిసి మాట్లాడగల చిరంజీవి ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఆమెను జయప్రదంగా పార్టీలో అయితే ఆయన చేర్పించగలడు కానీ, కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు అని పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సీటు క్రింద మంట పెట్టే సాహసం చేయగలడా? చేస్తే కాంగ్రెస్ అధిష్టానం సమ్మతిస్తుందా? పార్టీకి పాతకాపయిన ఉండవల్లిని కాదనుకొని అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రదకు టికెట్ ఎందుకు ఈయాలి అని అడిగితే చిరంజీవి దగ్గర సరయిన సమాధానం ఉందా?

 

ఏది ఏమయినప్పటికీ, జయప్రద ఇన్నేళ్ళ రాజకీయానుభవంలో ఈ మాత్రం చిన్న విషయం నేర్చుకోకనే రాజమండ్రీకి టికెట్ పుచ్చుకోవాలని బయలుదేరి వచ్చేసారా? అయినా నిన్ననే, ముఖ్యమంత్రి ఏదో సందర్భంలో “క్యూలో చాలా మంది ఉన్నారు. దయచేసి మీ సమయం వచ్చే వరకు వేచి చూడండి” అని ఒక ప్రకటన కూడా చదివినిపించినట్లు సమాచారం.మరటువంటప్పుడు ఆమె ఏ జీవిని నమ్ముకొంటే మాత్రం ఏమి లాభం ఉంటుంది?

 

ఆమెకు రాజమండ్రీ మీద అంతగా ఆసక్తి, తన గెలుపు మీద నమ్మకం ఉంటే హాయిగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసుకొని గెలిచేస్తే, ఆనక కేంద్రంలో ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా తగిన మూల్యం చెల్లించి మరీ ఆమెను తమ పార్టీలో చేర్చుకొంటుంది. గనుక, ఇక స్వంతంత్ర అభ్యర్ధిగా నిలబడి ఎన్నికలలో జయప్రదం అయిపోవడమే ఆమెకు మేలు.