మళ్ళీ ముఖ్యమంత్రిగా జయలలిత?

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న అక్రమ ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో, ఆమె మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడిన నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తన అనుచరుడు పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ కేసులో ఆమె ఇప్పుడు నిర్దోషిగా తీర్పు రావడంతో ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించే అవకాశాలున్నాయి. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రాగానే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం జయలలిత నివాసానికి చేరుకున్నారు. ఆయన త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జయలలిత మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. సోమవారం జయలలిత కేసులో తీర్పు వస్తుందని తెలిసిన ఆమె అభిమానులు తమిళనాడు దేవాలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. జయలలిత నిర్దోషిగా తీర్పు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు మిఠాయిలు పంచిపెట్టారు.