పొత్తు తేలకుండానే అభ్యర్థి ప్రకటన.. పవన్ సంకేతమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తల విషయంలో రోజుకో మలుపు తిరుగుతోంది. పూటకో రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇంత కాలం చెబుతూ వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏకపక్షంగా తమ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది కూడా కీలకమైన తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పార్టీ రాజకీయవ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ పోటీలో నిలుస్తారని పవన్ ప్రకటించారని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

దీంతో జనసేన, తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మరి పొత్తు సంగతేంటన్న చర్చ  ప్రారంభమైంది. వాస్తవానికి జనసేనాని ఏ నియోజకవర్గం నుంచైనా ఏక పక్షంగా అభ్యర్థిని ప్రకటించాలంటే ముందుగా తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ ప్రకటన చేయాలి అంతే తప్ప తెలుగుదేశంకు బలమైన స్థానంగా అంతా భావిస్తున్న తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించడమేమిటన్న చర్చ జరుగుతోంది. అంతే కాకుండా పొత్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలన్న ఒత్తిడిని తెలుగుదేశంపై పెంచే వ్యూహమా? లేక నాదేండ్లను తన నియోజకవర్గానికే పరిమితం చేయాలన్న ఉద్దేశమా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి నాదెండ్ల అభ్యర్థిత్వ ప్రకటన అన్న వార్త అసలే వేడిగా ఉన్న ఏపీ రాజకీయాలలో కాక పెంచిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ నిజంగానే తెనాలి నుంచి నాదెండ్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసి ఉంటే.. అది దేనికి సంకేతం.. పొత్తులు ఉంటాయా? ఉండవా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

మరీ ముఖ్యంగా తెనాలి నుంచి తెలుగుదేశం తరఫున ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత యాస్పిరెంట్ గా ఉన్నారు. ఆయనను కాదని పొత్తులో భాగంగా తెనాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనకు వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. జనసేన తెలుగుదేశం పొత్తు ఖాయమన్న భావనతో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టే కార్యక్రమాలలో కలిసి అడుగులేస్తున్నాయి. అటువంటి తరుణంలో పొత్తల విషయం తేలకుండా ఇరువురి నేతల మధ్యా చర్చ జరగకుండా పవన్ కల్యాణ్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున బరిలో ఉంటారంటూ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.  

లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీల డ్రామాలాగా ఇది కూడా వైసీపీ మైండ్ గేమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.   జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంత మాత్రం చీలనీయబోనని పదే పదే ప్రకటిస్తున్న జగన్ తనతో పాటుగా బీజేపీని కూడా కూడగట్టాలని యోచిస్తున్నారు.  ఇప్పటికే  బీజేపీతో  పొత్తు లో ఉన్న జనసేన, తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఇప్పటికే మిత్రుడిగా ఉన్న బీజేపీని కూడా కలిసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. బీజేపీ కలుస్తుందా? అందుకు తెలుగుదేశం అంగీకరిస్తుందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ తరుణంలో  పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వడం దేనికి సంకేతం. తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ కూటమి నుండి అభ్యర్దిగా రంగంలో ఉంటారన్న సంకేతమిచ్చారా అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే నిజమైతే మరి  తెనాలిలో తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా వరుసగా పోటీ చేస్తున్నారు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల పోటీ చేస్తే కూటమి లో ఉన్న తెలుగు దేశం పార్టి అభ్యర్దిగా ఆలపాటి రాజా పరిస్దితి ఎంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.   ఏది ఏమైనా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల అన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.