జగ్నన్న తోట ప్రభల తీర్థం.. ప్రత్యేకతలు.. విశిష్టతలు!
posted on Jan 16, 2026 9:34AM

దేశమంతా జరుపుకునే పండుగ సంక్రాంతి .. ప్రాంతాన్ని బట్టి పండుగ ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు సంక్రాంతి పండుగను తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్రాంతి పండుగ తరువాత వచ్చే కనుమ పండుగ కోససీమ వాసులకు ఒక అద్భుత ప్రత్యేక తీర్థాన్ని తీసుకువస్తుంది. కొబ్బరాకుల పందిరి వేసినట్లుండే కోనసీమలో కనుమ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఈ జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అసలింతకీ ఈ జగ్గన్న తోట తీర్ధం ప్రత్యేకతలు, విశిష్ఠతలు ఏంటంటే..
కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుంచి జనం ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన ఏ చిహ్నాలూ కనిపించవు. భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం.
శివుని వాహనంగా భావించే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని కొలుస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలతో ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్య గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలను జనం మోస్తారు. అలా మోయడం ఈశ్వర సేవగా భక్తులు భావిస్తారు.
నాలుగు శతాబ్దాలుగా ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోందంటారు. ఈ ప్రభల తీర్థానికొక గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ ఒక కారణం ఉందంటారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే వ్యక్తి ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించిన స్థానికులు అప్పటి నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారట. దీంతో వాళ్ళు ఈయన్నిఅడ్డుకుని నిజాం నావాబు వద్దకు తీసుకెళ్లారట. ఆ సందర్భంగా ఈ జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే జగ్గన్న ఈ ప్రభల తీర్థం జరిపాడని అంటారు. దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ ఉండదనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పేందుకే ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు.
ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొ విశేషం కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీక లోతు కౌశిక ప్రవాహాన్ని దాటుకుంటూ, పొలాల మధ్య నుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒకసారి ఎత్తిన తరువాత ఈ ప్రభలను కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీటి చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలను ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు. తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువు ఉంటాయి. అయినా వాటిని అవలీలగా దాటించగలగడం మాత్రం ఈశ్వరానుగ్రహం వల్లనేనని చెబుతారు వాటిని మోసే వాళ్లు. మొత్తంగా శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జగ్గనతోట ప్రభల తీర్ధం వైభవం ఎంత చెప్పినా తక్కువే.